Friday, November 22, 2024

Basara – అమ్మవారి సాక్షిగా..! హుండీలో ట్రీబుల్ ఐటీ కష్టాల లేఖ..!

బాస‌ర – బాసర త్రిబుల్ ఐటీ బాధలు ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు..!ఎందరికో మా బాధలు విన్నవించుకున్నాము కానీ సరస్వతి అమ్మవారి అయిన మీకు విన్నవించుకోలేదు. మీరు జ్ఞానం అందించే అమ్మగా మా తప్పులను క్షమించి మా పిల్లల బాధలు తీర్చే విధంగా పాలకులను, అధికారులను మేలు కొల్ప వలసిందిగా మా ప్రార్థన అంటూ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు(పేరు లేదు) బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి వినతిపత్రంగా ఒ లేఖను రాసి అమ్మవారి హుండీలో వేశారు.

బాసర ఆలయంలో జరుగుతున్న హుండీ లెక్కింపులో భాగంగా హుండీని తెరవగా అందులో ఈలేఖ ప్రత్యక్షమైంది. లేఖలో ఈ విధంగా ఉంది. ఆర్జీయూకేటీ బాసరలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులం శతకోటి దండాలతో తమరి పాదాలకు ప్రణమిల్లి వ్రాయునది ఏమనగా రెండేళ్లుగా మేము పోరాటాలు చేస్తున్నాము. అందులో చదువుతున్న మా పిల్లలు వారం రోజులు ఎండనక వాననక శాంతియుతంగా వారి చదువుల కోసం పోరాడారు. అంతటి పోరాటం చేస్తే అధికారులకు గాని ప్రభుత్వానికి గాని ఇంతవరకు కనికరం లేకుండా పోయింది. వారి చదువుల కోసం చేసిన పోరాటం ఎలాంటి ఫలితం లేకుండా పోయిందమ్మా…… పోరాటం చేసిన విద్యార్థులు అధికారుల ఒత్తిల్లకు లోనై మరణిస్తున్నారు. పిల్లల చిన్న ఆశలు అమ్మవైన నీకు తెలియనివి కావు… ఇకనైనా అధికారులకు జ్ఞానం ప్రసాదించి తమ పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేయవలసిందిగా తల్లిదండ్రులు లేఖ‌లో కోరారు. హుండీలో లభ్యమైన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరి అధికారులు స్పందిస్తారో లేక మనకెందుకు అని వదిలేస్తారో.

Advertisement

తాజా వార్తలు

Advertisement