బ్యారేజ్ లు కూలుతుంటే… డ్రామాలు చేస్తున్నారని కేసీఆర్ పై మండి పడ్డారు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి.. రాష్ట్రంలో పదేళ్లు పరిపాలించి ఇప్పుడు కాళేశ్వరం విషయంలో మా పైన విరుచుకుపడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పూర్ లూసర్ అని విమర్శించారు.
ఖమ్మంలో ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం అదృష్టవంతురాలిగా భావిస్తున్నానని తెలిపారు. సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనపైన ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన గుర్తింపు కాదని, ఖమ్మంలో కాంగ్రెస్ జెండా నీ వదలకుండా పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఇచ్చిన గుర్తింపు అన్నారు. తమ అధినేత సోనియా గాంధీతో పాటు పెద్దలసభలో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. పార్లమెంట్ లో ప్రస్తుతం చాలా ఇబ్బందికర వాతావరణం ఉందని… స్టాండర్డ్స్ మారిపోయాయని తెలిపారు. సభలో విపక్ష సభ్యులను, ఆడవాళ్ళను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇక ఆ పప్పులు సాగవన్నారు. ఖమ్మం లోక్ సభ కి ఎవ్వరినీ పోటీలో ఉంచిన గెలిపించుకుంటామన్నారు.
రైతులు ఉద్యమాలు చెయ్యవద్దా?
ప్రధాని రాజకీయాలు చెయ్యొచ్చు…దేశంలో ప్రజలకు అన్నం పెడుతున్న రైతులు ఉద్యమాలు చెయ్యవద్దా? అని ప్రశ్నించారు. అంత పెద్దయెత్తున ప్రజల డబ్బు ఖర్చుపెట్టి బారికెడ్స్ ఏర్పాటు చేసి రైతు ఉద్యమాలను అణిచివేస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి బదులు ఒక మంత్రిని పంపి చర్చలు జరపవచ్చు కదా? అని ప్రశ్నించారు. వీటన్నిటికీ రైతులు, ప్రజలు రాబోయే కాలంలో బుద్దిచెబుతారని తెలిపారు.