ఆ క్రూరమైన హత్య వెనుక ఉన్న కారణం తనని తీవ్ర భయాందోళనకి ..షాక్ కి గురి చేసిందని ట్వీట్ చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చోటు చేసుకున్న హత్యపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇలాంటి అనాగరిక హింసకు సమాజంలో చోటు లేదన్నారు. క్రూరమైన హత్యలకు పాల్పడే నేరస్తులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అత్యంత కఠినమైన శిక్ష విధించాలని మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో తెలిపారు. అసలు వివరాలు ఏంటంటే..రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు వ్యక్తులు పట్టపగలే ఓ టైలర్‌ను దారుణంగా హత్య చేశారు. కత్తితో తల నరికి మొండెం నుంచి వేరుచేశారు. ఈ ఘటన ధన్‌మండీ ఏరియాలోని ఒక దుకాణంలో చోటుచేసుకున్నది.
హత్యకు సంబంధించిన వీడియోను నిందితులు సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఉద్రిక్తతలు రాజేసింది. టైలర్ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన వివాదాస్పద మతపరమైన పోస్టు ఈ హత్యకు కారణంగా ఉన్నది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్య నేపథ్యంలో నగరంలో భారీగాబలగాలు మోహరించారు. కర్ఫ్యూ విధించారు. ప్రజలు గుమిగూడకుండా రాష్ట్రవ్యాప్తంగా నెల పాటు నిషేధాజ్ఞలు విధించారు. 24 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. ప్రజలు సంయమనం వహించాలని సీఎం అశోక్ గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు. హత్య వీడియోలను షేర్ చేయొద్దని కోరారు. హత్య దర్యాప్తునకు పోలీసు ఉన్నతాధికారులు సిట్ ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ ఉదయ్‌పూర్‌కు ఎన్‌ఐఏ బృందాన్ని పంపింది. హత్య కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేసే అవకాశం కనిపిస్తున్నది.