రాష్ట్రంలో సుస్థిరమైన పాలన ఉండాలంటే ఒకే నాయక వ్యవస్థ ఉండాలని.. కెసిఆర్ ఢిల్లీకి పోతే కేటీఆరే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజాంబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని వర్ని మండలం సిద్దాపూర్ శివారులో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టు వద్ద తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సాగునీటి వారోత్సవాలను ప్రాజెక్టు పరిసరాల్లో ఘనంగా నిర్వహించారు. వర్ని మండలం సిద్దపుర్ లో నిర్మిస్తున్న రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన సాగునీటి దినోత్సవం కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడారు. సాగునీటి దినోత్సవం ఎక్కడ ఫంక్షన్ హాల్ లో జరుపుకోవచ్చు కానీ మనం జరిపిన సాగునీటి దినోత్సవం సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల ఆవరణలో జరుపుకోవడానికి ప్రత్యేకత ఉందన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పట్ల ఎంతో శ్రద్ధతో పని చేయడం.. సాగునీటి కొరత లేకుండా నీరు అందించడంతోపాటు ..భావితరాలకు భవిష్యత్తును చూపించిన మహానీయుడని ..కేసీఆర్ ని భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు. వెనుకబడిన గిరిజనులు నివాసముండే ప్రాంతంలో సిద్దాపూర్ రిజర్వాయర్ ని నిర్మించుకోవడం.. సాగునీటి అభివృద్ధికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్, సహకార బ్యాంకు అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి, బాన్సువాడ స్థాయి ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.