నిజామాబాద్ ప్రతినిధి, జులై 16( ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొందరి వద్ద సీనియర్ బ్యాంకు మేనేజర్ నని.. మాయమాటలు చెప్పి… సుమారు కోటి రూపాయలు వరకు అప్పులు చేసి కుచ్చుటోపి వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ ప్రాంతంలో గల యూనియన్ బ్యాంక్ లో రెండు సంవత్సరాల నుంచి అజయ్ సీనియర్ బ్యాంక్ మేనేజర్ గా విధులు నిర్వ ర్తిస్తున్నాడు. సీనియర్ బ్యాంక్ మేనేజర్ గా పలు వ్యాపారులతో, వినియోగ దారులతో పరిచయాలు పెంచుకున్నాడు. ఈ క్రమంలో వారికి మాయమాటలు చెప్పి సుమారు 16మంది వద్ద రూ.60 లక్షల నుండి 1.కోటి వరకు కొందరికి చెక్కులు ఇచ్చి, మరికొందరి వద్ద ప్రాంసరి నోటు రూపంలో అప్పులు చేసి పరారైనట్లు సమాచారం. ఈ విషయం కాస్త దవానంలా వ్యాపించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
న్యాయం చేయాలని బ్యాంకును ఆశ్రయించిన బాధితులు..
యూనియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ చేతిలో మోసపోయిన బాధితులు న్యాయం చేయాలని శివాజీ నగర్ ప్రాంతంలో గల యూనియన్ బ్యాంకు ను ఆశ్రయించారు. సుమారు 16మంది బాధితులు యూనియన్ బ్యాంకులో ఉద్యోగులతో తమ బాధను మొరపెట్టుకున్నారు. కొందరికి రుణాలు ఇచ్చినట్టు చెక్కులు, మరికొందరికి ప్రాంసరీ నోట్లు ఇచ్చినట్లు బాధితులు వాపోయారు. సీనియర్ బ్యాంక్ మేనేజర్ తీసుకున్న అప్పుకు బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదని యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు తేల్చి చెప్పారు. మీరు ఇచ్చిన అప్పు విషయమై న్యాయం కావాలంటే పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించాలని చెప్పారు.
ఈ ఘటనపై గత రెండు రోజులుగా బ్యాంకులో ఆడిట్ చేస్తున్న వైనం…
నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ బ్రాంచ్, యూనియన్ బ్యాంకులో జరిగిన ఘటనపై… గత కొన్ని రోజులకు బ్యాంకులో ఆడిట్ జరుగుతుంది. ఇతరుల వద్ద సీనియర్ మేనేజర్ అప్పు చేయడమే కాకుండా… బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల్లో ఏదైనా గోల్ మాల్ జరిగిందో… అనే కోణంలో ఆడిట్ చేస్తున్నారు. రెండు రోజులుగా బ్యాంకులో అన్ని రికార్డులను పరిశీలిస్తున్నారు.
బాధితులకు న్యాయం జరిగేనా ?
ఇంత జరుగుతున్నా బాధితులు తమకు జరిగిన అన్యాయంపై ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయకపోవడం ఆశ్చ ర్యానికి గురిచేస్తుంది. కానీ న్యాయం చేయాలని బ్యాంకును మాత్రం ఆశ్రయించారు. అసలు సీనియర్ మేనేజర్ కోటి రూపాయలు వరకు అప్పు చేయడంలో అంతర్యం ఏమిటో ?…… మోసం చేసిన సదరు సీనియర్ బ్యాంకు మేనేజర్ పై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేనా అనేది వేచి చూడాల్సిందే.