Monday, November 25, 2024

తెలంగాణలో తీజ్ సందడి.. ప్రత్యేక ఏంటో తెలుసా?

తెలంగాణలోని గిరిజన తండాల్లో తీజ్ పండుగ సందడి నెలకొంది. తరతరాలుగా వస్తున్న సంస్కృతి సంప్రదాయంగా ఈ తీజ్ పండుగను లంబాడీలు ఘనంగా జరుపుతారు.   ఈ పండుగ బతుకమ్మను పోలి ఉంటుంది. తీజ్‌ను ఎనిమిది రోజుల పాటు పూజించి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగే తీజ్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.  తమకు మంచి వరుడు దొరకాలని పెళ్లీడు యువతులు తొమ్మిది రోజుల పాటు నవధాన్యాల మొలకలకు పూజలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. నిజామాబాద్ జిల్లాలో తీజ్ ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. నేటి హైటెక్ యుగంలోనూ తండాల్లో గిరిజనులు తమ సంప్రదాయాలను ఇంకా కొనసాగిస్తున్నారు.

పెళ్లికాని యువతులు వెదురు తట్టలో పుట్ట మట్టిని తెచ్చి అందులో నవధాన్యాలు విత్తుతారు.. 9 రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉంటూ ప్రతిరోజూ ఉదయం సాయంత్రం మొలకలకు నీళ్లు పోస్తూ పూజలు చేస్తారు. ఈ కార్యక్రమాలన్నింటికి ఒక అమ్మాయి నాయకురాలిగా వ్యవహిస్తుంది. ఆమె తొమ్మిది రోజుల పాటు ఆకు కూరలు తింటూ శుచిగా ఉంటుంది. పెళ్లి కాని యువతులంతా బావి దగ్గరకు వెళ్లి పరిశుభ్రమైన ఇత్తడి బందెల్లో నీళ్లు తెచ్చి పాటలు పాడుతారు. తరువాత గోధుమలు చల్లిన బుట్టలను తండా నాయకునికి ఇంటి ముంగిట్లో అరుగుపై కాని, వేదికపై గాని పెడతారు. మరుసటి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు రోజుకు మూడుసార్లు అమ్మాయిలు బుట్టల్లో నీళ్ల పోస్తు పాటలు పాడుతారు. తీజ్‌ పండుగను సేవా బాయ దండియాడి అనే దేవత జరిపిస్తుందని, తీజ్‌ బుట్టలను పెట్టించిన దేవతనే స్వయంగా ఈ పండుగను జరిపిస్తుందని గిరిజనులు విశ్వసిస్తారు. ఏడో రోజు ఢమోళి అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి ఇంట్లో బియ్యం పిండితో చుర్మో రొట్టేలు చేసి వాటిని బెల్లంతో కలిపి ముద్దలు చేస్తారు. మరోవైపు తీజ్‌ ఉన్న ఇంటి ఆవరణలో సేవాబాయి, మెరామల పూజలు నిర్వహిస్తారు. మెరామల పూజ ఇంటి ముందు జొన్నలు నింపిన గోనే సంచులు ఉంచి దానిపై ఒక చిన్న బిందేలో నీళ్లు పోసి అందులో వేప మండలు వేస్తారు. మేక పోతులను తెచ్చి గొనె సంచులకు ఎదురుగా నిలబెట్టి దాని తలకు కాళ్లకు పసుపు రాస్తారు. నోటిలో నీళ్లు పోస్తారు. మెరామతల్లికి బలి ఇవ్వడం లంబాడీల ఆచారం.

9 రోజుల తర్వాత నిమజ్జన వేడుకలను సంప్రదాయబద్దంగా జరుపుకుంటారు. తొమ్మిదవ రోజు పెళ్లి కాని యువతులు ఉదయం అందరూ కలిసి ప్రతి ఇంటింటికి వెళ్లి ఉయ్యాల ఆట ఆడుతారు. పాటలు పాడుతూ ఆ రెండు బొమ్మలను ఉయ్యాలలో కూర్చోబెట్టుకొని ఉయ్యాలలో ఊగుతూ పాటలు పాడుతారు. నూతన వస్త్రాలు ధరించి సంప్రదాయ నృత్యాలు ఆటలతో అలరిస్తారు. నవధాన్యాల మొలకలను తాండాలోని ఆలయం వద్ద ఒక చోట చేర్చి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు. నిమజ్జనం జరిపే చివరి రోజు వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి. వివిధ గ్రామాల్లో ఉండే తమ బంధుమిత్రులను ఆహ్వానిస్తారు. చదువుల కోసం ఉద్యోగరీత్యా పట్టణాలు, నగరాల్లో స్థిరపడ్డ వారు సైతం తీజ్ పండగ కోసం తండాలకు చేరుకుంటారు. ప్రధాన వీధుల మీదుగా ఊరేగింపుగా బయలుదేరుతారు. నిమజ్జనం తీజ్‌ బుట్టల్ని నీళ్లలో వదిలేయడం ఆచారం. దీంతో తీజ్‌ పండుగ ముగుస్తుంది.  కొన్ని చోట్ల గ్రామ కమిటీలు ఈ పండుగ నిర్వహిస్తుండగా మరికొన్ని చోట్ల గిరిజనులు ఈ ఆచారాన్ని ప్రతి ఏటా కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement