న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గద్వాల ఎమ్మెల్యే వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తూ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది సుందరం.. కృష్ణమోహన్ రెడ్డి వాదన వినకుండానే హైకోర్టు తీర్పునిచ్చిందని, ఇదే విషయాన్ని తీర్పులో కూడా ప్రస్తావించిందని తెలిపారు. కృష్ణమోహన్ రెడ్డికి నోటీసులు అందలేదని, కానీ అందినట్టుగా ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి హైకోర్టును తప్పుదోవపట్టించారని తెలిపారు.
అఫిడవిట్‌లో బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడించకపోవడం తప్పేనని అంగీకరిస్తూ.. అవి పొదుపు ఖాతాలని, అందువల్లనే వెల్లడించలేదని తెలిపారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి చెందిన స్థలాన్ని గతంలోనే విక్రయించారని, అందుకే అఫిడవిట్లో చూపలేదని చెప్పారు. కేసును విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుపై ‘స్టే’ విధించింది. ప్రతివాది డీకే అరుణతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నాటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తరఫున పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి డీకే అరుణ (నాటి కాంగ్రెస్ అభ్యర్థి)పై గెలుపొందారు.
అయితే ఆయన ఆస్తులకు సంబంధించి అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఇచ్చారని, ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ డీకే అరుణ న్యాయపోరాటం మొదలుపెట్టారు. హైకోర్టులో ఈ కేసుపై సుమారు నాలుగేళ్ల పాటు విచారణ జరిగింది. హైకోర్టు నోటీసులు ఇచ్చినా సరే తన వాదనలు వినిపించేందుకు కృష్ణమోహన్ రెడ్డి హాజరుకాకపోవడంతో హైకోర్టు ఎక్స్-పార్టీ తీర్పునిచ్చింది. ఆస్తుల వివరాలు తప్పుగా పేర్కొనడం అవినీతి చర్యగా పరిగణిస్తూ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది. రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఆ తీర్పు ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తూ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌లో ప్రచురించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఆయనకు ఊరట లభించింది.
డీకే అరుణకు శిక్ష తప్పదు: బండ్ల
కేంద్రం అండతో డీకే అరుణ హైకోర్టులో తనపై కేసు గెలిచారని, కానీ హైకోర్టును తప్పుదోవపట్టించినందుకు ఆమె శిక్ష తప్పదని బీఆర్ఎస్ నేత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం సుప్రీంకోర్టులో విచారణ అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడిన కృష్ణమోహన్ రెడ్డి, వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజారిటీ తో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. డీకే అరుణ అసలు పోటీలోనే ఉండరని అన్నారు. హైకోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది కాబట్టి ఆ తర్వాత జరిగిన అన్ని చర్యలపై స్టే వర్తిస్తుందని వెల్లడించారు. తద్వారా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్‌ను కూడా నిలుపుదల చేయాల్సి ఉంటుందని చెప్పారు.
హైకోర్టులో కేసు విచారణ దశలో తనకు నోటీసులు అందనే లేదని, కానీ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నోటీసులు అందినట్టు తప్పుడు రికార్డులను హైకోర్టుకు సమర్పించారని ఆరోపించారు. తన వాదన వినకుండానే హైకోర్టు తీర్పునిచ్చిందని, తీర్పులో ఈ విషయాన్ని ప్రస్తావించిందని గుర్తుచేశారు. సుప్రీంలో లభించిన స్టే ద్వారా న్యాయం తనవైపే ఉందని రుజువు అయిందని, సుప్రీంలో తనకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నేతలు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గత ఎన్నికల్లో 28 వేల ఓట్ల మెజారిటీతో గెలిచానని, ప్రజల్లో గెలవలేకనే బీజేపీ ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.