Sunday, November 24, 2024

TG: ఉప్పల్ రైల్వే స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయండి – రైల్వే మంత్రికి బండి లేఖ

కరీంనగర్-హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్‌ ప్రాజెక్టు పూర్తి నివేదిక (డీపీఆర్) సిద్ధమైనందున నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్..రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో రైల్వే మంత్రిని కలిసి బండి సంజయ్‌ లేఖ ఇచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ లేఖలో..కరీంనగర్ నుండి హసన్‌పర్తి వరకు 61.8 కి.మీల మేరకు నిర్మించే కొత్త రైల్వే లైన్‌కు రూ.1415 కోట్లు వ్యయం అవుతుంది. ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్ధమైందని తెలిపారు.

రైల్వే బోర్డులో ఈ అంశం పెండింగ్‌లో ఉందని, తక్షణమే ఆమోదం తెలపాలని కోరారు. కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం పూర్తయితే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, కరీంనగర్-వరంగల్ మధ్య వాణిజ్య కనెక్టివిటీ పెరిగి ఆర్దిక వృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.

దీంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్‌ను అప్ గ్రేడ్ చేయాలని, జమ్మికుంట స్టేషన్ వద్ద దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ మరో లేఖ అందజేశారు. ఉప్పల్ స్టేషన్ అప్ గ్రేడ్‌లో భాగంగా ప్లాట్ ఫాం, రైల్వే స్టేషన్ భవనాన్ని ఆధునీకరించాలని, కొత్త రైల్వే సేవలను ప్రవేశపెట్టాలని కోరారు.

- Advertisement -

ప్రయాణీకుల రాకపోకలకు సంబంధించిన సౌకర్యాలను మెరుగుపర్చాలని, పార్కింగ్‌ను విస్తరించాలన్నారు. అలాగే, సోలార్ ప్యానల్స్‌ను కూడా అమర్చాలని, టిక్కెట్ కౌంటర్, లగేజీ నిర్వహణ వ్యవస్థను మెరుగుపర్చాలని లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు ఎంతో మేలు కలిగించే ఉప్పల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement