Thursday, November 21, 2024

మేం మాట్లాడితే తట్టుకోలేవ్: సీఎం కేసీఆర్ కు బండి వార్నింగ్

ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ భాష ఏ విధంగా ఉందో అందరూ చూశారన్నారు. కేంద్రమంత్రిపై ఇలాంటి భాషే వాడతారా? అంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. మేం కూడా మాట్లాడటం మొదలు పెడితే తట్టుకోలేరని హెచ్చరించారు. ’’ రా రైస్ కొంటామని మేం చెబుతతున్నాం. మీరు ఎలా కొనరో మేం చూస్తాం. కొనుగోలు కేంద్రాలను బంద్ చేస్తారా? చేయండి చూద్దాం.‘’ అంటూ బండి నిప్పులు చెరిగారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతుల ప్రయోజనాల కోసం మర్యాదగా, హుందాగా  మాట్లాడారని, కేసీఆర్ కు మైండ్ దొబ్బిందని విమర్శించారు. కిషన్ రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. కేసీఆర్ భాషను చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు.     కేసీఆర్ సెన్సార్ భాష వాడుతున్నాడన్న బండి… తెలంగాణ ప్రజలు వాడే భాషేనా? అని ప్రశ్నించారు. ఢిల్లీకి పర్యటన తర్వాత కేసీఆర్ కు పిచ్చి ముదిరినట్లుందని ఎద్దేవా చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి హద్దుమీరి దిగజారి కేంద్ర మంత్రిపై విమర్శలు చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ జాగ్రత్త…ఏది పడితే అది మాట్లాడితే జనం సహించరు అని హితవు పలికారు. కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిందే రైతులు పండించిన రా రైస్ కొంటమని చెప్పడానికీ అని, అది కేసీఆర్ అర్ధం కాలేదన్నారు. కేబినెట్ మీటింగ్ పెట్టి ఎట్ల తిట్టాలే…ఎట్ల బ్లఫ్ చేయాలనే దానిపైనే కేసీఆర్ చర్చించినట్లుందన్నారు. రా రైస్ కొంటమని మేం చెబుతుంటే……కొనబోము, కొనుగోలు కేంద్రాలు మూసేస్తవని కేసీఆర్ చెబుతున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన వరి ధాన్యం ప్రతి గింజ కొని తీరాల్సిందేని బండి స్పష్టం చేశారు. ప్రతి గింజ మేమే కొంటున్నవని ఇన్నాళ్లూ రైతులను మోసం చేశారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు మూసివేత పెద్ద కుట్ర అని అభివర్ణించారు.

గత ఏడాది డిసెంబర్ లో పంట కొనుగోలు వల్ల రాష్ట్రానికి రూ.7500 కోట్ల నష్టం వచ్చిందని నాడు కేసీఆర్ చెప్పిన విషయాన్ని బండి గుర్తు చేశారు. ఇకపై గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండవు అని ప్రకటించారని తెలిపారు. అయితే, ఆనాడు ఈ గొడవే లేదన్నారు. వానా కాలంలో మాదిరిగానే యాసంగిలోనూ కొని తీరాల్సిందేనని బండి డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రంలో లేని సమస్య తెలంగాణలోనే ఎందుకొచ్చింది? అని ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ లొల్లి మాత్రమేనని అన్నారు. గతంలో కేరళ, తమిళనాడులో బాయిల్డ్ రైస్ కొనేవారని…ఇఫ్పుడు ఎవరూ తినడం లేదని చెప్పారు. మరి ఆ రైస్ ఏం చేయాలి? అని నిలదీశారు. బాయిల్డ్ రైస్ అంతా నీ ఫాంహౌజ్ ముందు, ప్రగతి భవన్ కుమ్మరిస్తామని పేర్కొన్నారు. మెడమీద కత్తిపెడితే…నీ ఫాంహౌజ్, నీ ఆస్తులన్నీ రాసిస్తవా? అని నిప్పులు చెరిగారు. అక్టోబర్ 4న బాయిల్డ్ రైస్ పంపబోమని సివిల్ సప్లయిస్ అధికారి అనిల్ కుమార్ కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. కేంద్ర అధికారులు వరంగల్ లో గతంలో ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే ఒక్క జిల్లాలో 25 వేల 303 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. అందుకే పంట విస్తీర్ణం…ధాన్యం దిగుబడి మధ్య చాలా తేడా కన్పించినట్లు గుర్తించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మొదట 40 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే పంపుతామని చెప్పిందన్న బండి..తరువాత మరో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపుతామని సమాచారం ఇచ్చిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement