ప్రభన్యూస్ ప్రతినిధి జనగామ : ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిజంగా దమ్ముంటే.. డిస్కంలతోపాటు సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలకు ఎన్నెన్ని బకాయిలున్నాయనే అంశంపై తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా జనగామ జిల్లా రఘునాధ్ పల్లి మండలంలోని ఖిలాశాపూర్ గ్రామ సమీపంలోఏర్పాటు చేసిన శిబిరం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు..రాష్ట్రంలో మరోసారి కరెంట్ ఛార్జీల పెంచి ప్రజలపై మరో రూ.4 వేల కోట్ల భారాన్ని మోపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ తీరువల్ల విద్యుత్ సంస్థలకు రూ.60 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని, తద్వారా కరెంట్ ఉత్పత్తి సంస్థలన్నీ మూతపడే దుస్థితి ఏర్పడిందన్నారు.ప్రణాళిక లేకుండా ప్రజలపై భారం మోపే ఇలాంటి పార్టీలకు ఓట్లేయద్దని కోరుతున్నానని పేర్కొన్నారు. ఈ దుస్థితి నుండి బయటపడేసేందుకే కేంద్ర ప్రభుత్వం పవర్ ఎక్సేంజీల వద్ద విద్యుత్ కొనడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు.
మునుగోడు ప్రజలు బీజేపీవైపే..
కాంగ్రెస్ పార్టీ మునుగోడు ప్రజలకు పాదాభివందనమే కాదు.. పొర్లు దండాలు పెట్టినా కాంగ్రెస్ కు ఓటయని పరిస్థితి నెలకొంది.. ఈసారి కూడా మునుగోడు ప్రజలంతా బీజేపీవైపే ఉన్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. కమ్యూనిస్టులు ఎంగిలి మెతుకుల కోసం కేసీఆర్ వద్ద మోకరిల్లారు. ఆ పార్టీ కార్యకర్తలే లీడర్లను ఛీ కొడుతున్నాయి. నా పాదయాత్రలో కమ్యూనిస్టు కార్యకర్తలు వచ్చి మద్దతిస్తున్నారు. మునుగోడులో ఓటుకు 30 వేలు ఇచ్చి గెలవాలని టీఆర్ఎస్ చూస్తోందన్నారు.అనంతరం మునుగోడులో రేపు జరగబోయే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభను దిగ్విజయవంతం చేయాలని ప్రజలను ఈ సందర్బంగా కోరారు.