హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్) టెండరు కేటాయింపు విషయంలో వెల్లువెత్తుతున్న అవినీతి ఆరో పణలపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని, ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం కేసీఆర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. టెండరు కేటాయిం పుపై ఉత్పన్న మవుతున్న అను మానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సీఎంపై ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ఇప్పటికే ఓఆర్‌ఆర్‌పై ఏడాదికి రూ. 415 కోట్ల ఆదాయం వస్తుందని, ఇది ప్రతి ఏటా 5శాతం పెంచు కుంటూ పోయినా 30ఏళ్లకు ప్రభుత్వానికి రూ.30, 000 కోట్ల ఆదాయం చేకూరేదని గుర్తు చేశారు. టెండరు కేటాయింపులో ప్రభుత్వం ఈ కోణంలో ఆలోచించకపోవడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోందని తెలిసినా ఓ సంస్థకు టెండరు కట్టబెట్టడం వెనక తతంగం ఏమిటి?, అసలు ప్రభుత్వం ఈ విషయంలో ఇంత గోప్యత ఎందుకు పాటిస్తోందని ప్రశ్నించారు. హైదరాబాద్ ఓఆర్‌ఆర్ టెండరు దక్కించుకున్న ఐఆర్‌బీ సంస్థనే ముంబై-పూణ ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు, ముంబై-పూణ నేషనల్ హైవే-4 టోలింగ్ చేపడుతోందని, అయితే అక్కడ తక్కువ దూరం, తక్కువ కాలానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ధరకు టెండరు కేటాయించగా, తెలంగాణలో ఎక్కువ కాలం, ఎక్కువ దూరానికి తక్కువ ధరకు టెండరు ఇవ్వాల్సిన అవసరం ఏమిటో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే లిక్కర్ స్కాంలో, ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వ్యక్తమయ్యాయని, తాజాగా ఓఆర్‌ఆర్ టెండరు కేటాయింపులో మీ మౌనం భారీ స్కాం జరిగిందన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోందని స్పష్టం చేశారు. ఓఆర్‌ఆర్ టెండరు ప్రక్రియను తుది నుంచి చివరకంటా ప్రభుత్వం గోప్యంగానే ఉంచిందని మండిపడ్డారు. బేస్ ప్రైస్ ఎంత పెట్టారో కూడా చెప్పేందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని దుయ్యబట్టారు. అదే సమయంలో ఓఆర్‌ఆర్ టెండరు ప్రక్రియలోని లోపాలను ప్రశ్నిం చే పార్టీలకు లీగల్ నోటీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు. లీగల్ నోటీసులు జారీ చేస్తుండడంతో ఈ టెండరు విషయంలో ఏదో జరిగిందన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోందని లేఖలో ఘాటుగా వ్యాఖ్యానించారు. తక్షణమే ఓఆర్‌ఆర్ టోల్ టెండర్ వ్యవహారంపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని , పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వేస్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.