- కరీంనగర్ ను అద్దంలా తీర్చిదిద్దుతా
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
ఆంధ్రప్రభ, కరీంనగర్ : కరీంనగర్ ను అద్దంలా తీర్చిదిద్దేందుకు నిధులు తెచ్చే బాధ్యత తనదేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయంలో పార్టీలకతీతంగా కరీంనగర్ మేయర్ తోపాటు కార్పొరేటర్లు బండి సంజయ్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందరూ కలిసి సన్మానిస్తారని నేను ఊహించలేదన్నారు. ఇదే కార్పొరేషన్ లో నేను రెండుసార్లు కార్పొరేటర్ గా పనిచేశానని గుర్తు చేశారు.
కార్పొరేటర్లంతా అభివృద్ధికి పనిచేయాలన్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ కార్పొరేషన్ కు కేంద్రం పూర్తి స్తాయిలో సహకరించిందని, ఇకపై ఎక్కువ నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వం, కార్పొరేటర్ల సహకారంతో నా మార్క్ అభివృద్ధి చూపిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన, వాటా ఉంటేనే కేంద్రం నిధులు ఇవ్వగలుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మేయర్ నన్ను ఇటీవల కలిసి కార్పొరేషన్ అభివృద్ధి కోసం అద్బుత ప్రణాళికను మా ముందుంచారని, దాని అమలు కోసం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో చర్చిస్తానన్నారు. స్మార్ట్ సిటీ నిర్మాణానికి అవసరమైన నిధులు తీసుకొస్తానని తెలిపారు.