న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కాజీపేట నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వే లైన్ నిర్మించాలని తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్న బండి సంజయ్ బుధవారం సాయంత్రం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. కాజీపేట(హసన్‌పర్తి) నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వే లైన్‌ను నిర్మించాలని కోరారు. దీంతో పాటు ఈనెల 8న వరంగల్‌లో ఖాజీపేట వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్, పీవోహెచ్‌కు సంబంధించి భూమి పూజ ఏర్పాట్లపై అశ్విని వైష్ణవ్ బండి సంజయ్‌తో చర్చించారు.
కాజీపేట నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి సత్వర చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ ఆయనను కోరారు. ఆయన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన అశ్విని వైష్ణవ్ వెంటనే ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను తెప్పించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు కేంద్రమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో బండి సంజయ్‌తో పాటు కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, పార్టీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప పాల్గొన్నారు. కేంద్రమంత్రితో సమావేశం అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. రేపు ( గురువారం) హైదరాబాద్ వెళ్తానని చెప్పారు.