న్యూఢిల్లీ – బిజెపి ఎంపి బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బండి సంజయ్ ట్విట్టర్ లో ఫొటోలు పోస్ట్ చేశారు. నరేంద్ర మోడీని కలిసిన ఈ రోజు మర్చిపోలేనిదని పేర్కొన్నారు. మోడీ తన కుటుంబం కోసం కేటాయించిన ప్రతి క్షణాన్ని తన జీవితకాలం పాటు ఓ బహుమతిగా భావిస్తూనే ఉంటానని తెలిపారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న అనంతరం బండి సంజయ్ ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా కలిసిన విషయం తెలిసిందే. తెలంగాణలోని పరిస్థితులపై బండి సంజయ్ తో మిత్ షా చర్చించారు. మరో మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలని బండి సంజయ్ కు అమిత్ షా చెప్పారు. ఈ నేపథ్యంలోనే సంజయ్ నేడు మోడీని కలిశారు.. ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా శుక్రవారం ఉదయం బీజేపీ కేంద్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం ఢిల్లీ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి బండి సంజయ్ చేరుకుంటారు.