మిర్యాలగూడ, (ప్రభన్యూస్) : బండి సంజయ్ ఖబడ్దార్.. దేశంలోనే అత్యధికంగా 60 లక్షల సభ్యత్వం కలిగిన టీఆర్ఎస్ పార్టీ తలుచుకుంటే.. ఒక్క పిలిపిస్తే బీజేపీ నాయకులు గల్లీలో కూడా అడుగుపెట్టలేరని రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్.. నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సోమవారం నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా రైతులపై హైదరాబాద్, కరీంనగర్ లకు చెందిన గుండాలతో దాడులు చేయించడం అమానుషమన్నారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలు చేసి.. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను సరాసరి మంత్రి కొడుకే.. కారుతో తొక్కించి చంపిన బీజేపీ.. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కొనసాగుతుందని విమర్శించారు. బీజేపీ మ్యానిఫెస్టో లోనే రైతు వ్యతిరేకత అనే అంశం ప్రత్యేకంగా ఉన్నట్లుదన్నారు.
ధాన్యం సేకరణ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే అంశమన్న వాస్తవాన్ని విస్మరించి.. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనప్పటికీ సీఎం కేసీఆర్ పై నిందలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. బండిసంజయ్ కి రోషం.. పౌరుషం ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ధాన్యమంతా కొంటామని లేఖ తేవాలని డిమాండ్ చేశారు.
గడచిన ఏడేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యమంతా కొనుగోలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై అడ్డగోలు ఆరోపణలు చేస్తే తెలంగాణ రాష్ట్ర మంతటా ఇదేవిధంగా రైతులు బరాబర్ అడ్డుకుంటారని అన్నారు. సమావేశంలో డీసీసీబీ జిల్లా డైరెక్టర్ బంటు- శ్రీనివాస్, సహకార సంఘాల చైర్మన్లు నక్క శేఖర్, రామకృష్ణ,వెంకట్ రెడ్డి, సంజీవరెడ్డి, రాములుగౌడ్ తదితరులు ఉన్నారు.