Tuesday, November 19, 2024

త్వరలో 50 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీ

ప్రభుత్వ ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే దక్కేలా టీఆర్ఎస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సమున్ అన్నారు. ఉద్యోగ నియామ‌కాల్లో 95 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కే ద‌క్కేలా నిర్ణ‌యం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో స్థానికులకు ఉద్యోగాలు రాకుండా ఓపెన్ కోటాలో భర్తీ ఉండేదన్నారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల్లో జ‌రిగిన అన్యాయంపై పోరాటం చేసి తెలంగాణ‌ను తెచ్చుకున్నామని తెలిపారు. తెలంగాణ రైతులకు రెండు పంటలకు నీళ్లు అందిస్తూ అన్నదాతలకు సంపూర్ణ న్యాయం ప్రభుత్వం చేస్తోందన్నారు.

నిధుల విషయంలో ఇప్పటికే ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ ను పెంచుతూ మన నిధులు మనమే వాడుకుంటున్నామని తెలిపారు. నీళ్లు, నిధులు, నియ‌మాకాల్లో జ‌రిగిన అన్యాయాన్ని సీఎం కేసీఆర్ సరిదిద్దుతున్నారు. రాబోయే రోజుల్లో ఉద్యోగాల భ‌ర్తీ ఊపందుకుంటుందని తెలిపారు. ఇన్నాళ్లు కేంద్రం నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఉద్యోగాల భ‌ర్తీ ఆల‌స్య‌మైందని పేర్కొన్నారు. 50 వేల పైచిలుకు ఉద్యోగాల భ‌ర్తీకి రాష్ర్ట ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. గడిచిన ఆరున్నరేళ్లలో ల‌క్షా 32 వేల ఉద్యోగాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసిందని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ- ప్రైవేట్ ఉద్యోగాల భర్తీ వేగంగా జరగనుందని ధీమా వ్యక్తం చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా ప్రైవేట్ రంగంలో ల‌క్ష‌లాది మందికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భించాయ‌న్నారు.

ఉద్యోగ నియామ‌కాల్లో బీజేపీ నాయ‌కులు తెలంగాణ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే ముందు.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేశారో చెప్పాల‌ని సుమ‌న్ డిమాండ్ చేశారు. సంవ‌త్స‌రానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌న్న ప్ర‌ధాని మోదీ హామీ ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. ఉద్యోగాల విషయంలో వైఎస్ షర్మిల అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. షర్మిలకు తెలంగాణపై అవగాహన లేదని, రాష్ట్రంలో రాజన్న రాజ్యం అంటే నవ్వు వస్తోందని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement