తెలంగాణలో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం పెట్టిన సంగతి తెలిసిందే. కాగా బలగం సినిమాలో తమ పాట ద్వారా ప్రేక్షకులను మెప్పించిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు తెలంగాణ ప్రభుత్వం తరపున దళిత బంధు పథకం కింద రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కారును అందించారు. ఈ సందర్బంగా మొగిలయ్య, కొమురమ్మ దంపతులు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమకు అన్ని విధాలుగా అండగా నిలిచిన మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, బేడ బుడగ జంగాల జెఎసి చైర్మన్ టి.జగదీశ్వర్, వైస్ చైర్మన్ చింతల యాదగిరిలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అలాగే బేడ బుడగ జంగాల ప్రతినిధిగా చింతల యాదగిరికి తగిన పదవి ఇచ్చి, గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులందరు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. మూడేండ్లలో దళితులందరికీ దళిత బంధు ద్వారా ఆర్థిక సాయం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు. అందుకే అందరి క్షేమం కోసం ఆలోచిస్తూ, పరిపాలన సాగిస్తున్నారని, దళితులంతా ఆయనకు అండగా నిలవాలని మంత్రి కోరారు. బలగం సినిమాలో అద్భుతంగా పాట పాడి అందరినీ ఆకట్టుకున్న మొగిలయ్య, కొమురమ్మలకు కేసీఆర్ అండగా నిలిచారన్నారు. మొగిలయ్య ఆరోగ్యం బాగు కోసం నిమ్స్‌లో చేర్పించి వైద్యం చేయిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం మానవత్వమున్న ప్రభుత్వమని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, సుంకె రవిశంకర్, జోగినపల్లి శ్రీనివాసరావు, బేడ బుడగ జంగాల జేఏసీ చైర్మన్ టి.జగదీశ్వర్, వైస్ చైర్మన్ చింతల యాదగిరితో పాటు తదితరులు పాల్గొన్నారు.