జూబ్లీహిల్స్ రేప్ కేసులో ఎమ్మెల్యే కుమారుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 28న ఓ పార్టీలో పాల్గొనేందుకు జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్‌కు వచ్చిన మైనర్ బాలికపై సాదుద్దీన్ అనే యువకుడితో పాటు నలుగురు మైనర్లు సామూహిక అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. మరో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు రిమాండ్ రిపోర్టు లో పేర్కొన్నారు.
నిందితుల్లో చాలా మందికి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండటంతో కేసు సంచలనంగా మారింది. నలుగురు మైనర్లు కావడంతో.. పోలీసులు ముందు నుంచి సాదుద్దీన్‌నే ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. మిగతా మైనర్ నిందితుల్లో ఓ ప్రభుత్వ శాఖలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి కుమారుడు, సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడితో పాటు మరో ఇద్దరు వ్యాపారవేత్తల కుమారులున్నారు. ఈ కేసులో జువైనల్ హోమ్‌లో ఉన్న నలుగురికి మంగళవారం బెయిల్ రాగా, ఈరోజు ఎమ్మెల్యే కుమారుడికి బెయిల్ మంజూరైంది.