హైదరాబాద్, ఆంధ్రప్రభ: జూన్ 13 నుంచి బడులు పున:ప్రారంభం కానుండడంతో బడి ఈడు పిల్లలను గుర్తించి బడుల్లో చేర్పించడంలో భాగంగా జూన్ 3 నుంచి 30 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అదేవిధంగా జూన్ 13 నుంచి 30 వరకు రోజుకొక్క కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేశారు.
జూన్ 13న మన ఊరు-మన బడి, 14న ఇంగ్లీష్ మీడియం బోధన, 15న పేరెంట్ టీచర్ సమావేశం, 16న స్కూల్ మేనేజ్‌మెంట్ మీటింగ్, 17న పొదుపు సంఘాల మహిళలలతో సమావేశం, 18న బాలికల విద్య-కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఇలా జూన్ 30వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి సర్కారు బడులు, ప్రభుత్వ విద్య, ఇంగ్లీష్ బోధన ప్రాముఖ్యతను తెలియజేయనున్నారు. ఈ బడిబాట కార్యక్రమంలో విద్యాధికారులు, స్థానిక, జిల్లా ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు భాగస్వామ్యం కానున్నారు.