వైద్యుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే శిశువు చనిపోయిందని.. ఆస్పత్రిపై బంధువులు దాడిచేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆస్పత్రిలో 4 రోజుల శిశువు మృతి చెందింది. జిల్లాలోని దొనబండ గ్రామానికీ చెందిన దావని అనే గర్భిణి.. ఈనెల 19న డెలివరీ కోసం జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆస్పత్రిలో చేరింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి.. డెలివరీ చేశారు. దావని ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే శిశువు పుట్టిన మరుసటి రోజు అనారోగ్యంగా ఉండడంతో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. శిశువును పరీక్షించి ప్రమాదం ఏం లేదు. పాపకు కొద్దిగా జ్వరం ఉందని చెప్పి.. సిరప్ పోసి పంపించారు.
పాప గుక్కపెట్టి ఏడుస్తుండగా.. తర్వాతి రోజు మళ్లీ డాక్టర్ వద్దకు తీసుకొచ్చారు. శిశువుకు వైద్యం అందిస్తున్నామని వైద్యులు బాధిత కుటుంబ సభ్యులకు చెప్పారు. అప్పటికే పాప పరిస్థితి విషమించింది. నాలుగు రోజులు గడిచిన తర్వాత పొట్టవాచి, కాళ్లు పచ్చబడ్డి చివరికి పాప చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. దీంతో డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని దావని బంధువులు ఆందోళనకు దిగారు. బాధితురాలి బంధువులు ఆగ్రహించి ఆస్పత్రిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆస్పత్రి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని ఆరా తీస్తున్నారు. తమ పాప ప్రాణాలు తీసిన డాక్టర్లను, నిర్లక్ష్యంగా వ్యహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.