హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కు ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు తాజాగా, ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. 2020-2023 మధ్య కాలంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రూ.3.8 కోట్ల మేర నిధులను దుర్వినియోగం చేశారని ఆయనపై ఈడీ అభియోగం మోపింది.
అదేవిధంగా హెచ్‌సీఏ ఆడిట్‌లో కూడా అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆధారాలను సైతం బయటపెట్టింది. అయితే, కేసులో ఇప్పటికే అజారుద్దీన్ ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. కాగా, ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మౌలిక సదుపాయాలైన డీజిల్ జనరేటర్లు, అగ్నిమాపక యంత్రాల కొనుగోళ్లలో రూ.20 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. గతేడాది ఫిబ్రవరిలో అజారుద్దీన్ ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తప్పించింది.
సంస్థ పనితీరును పరిశీలించేందుకు రిటైర్డ్ జడ్డి జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు కు బాధ్యతలు అప్పగించింది. అదేవిధంగా హెచ్‌సీఏలో నెలకొన్న సమస్యల పరిష్కారం, ఎన్నికల నిర్వహణ బాధ్యతలను కూడా కోర్టు ఆయనకే కట్టబెట్టి విషయం తెలిసిందే.