Friday, November 22, 2024

అందుబాటులోకి ఆయుర్వేద వైద్యం.. పీహెచ్‌సీల్లోనే ఆయూష్‌ సేవలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అల్లోపతి వైద్యంతోపాటు ఆయూష్‌ ఆయుర్వేద వైద్యం కూడా ఇక మీదట రోగులకు విరివిగా అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోని పీహెచ్‌సీల్లోనే ఆయూష్‌ వైద్య సేవలు కూడా అందనున్నాయి. ఈ విషయమై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో సాంప్రదాయ, ప్రకృతి సిద్ధమైన వైద్యం వైపు ఆసక్తి పెరిగింది. కరోనా తర్వాత శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు, వ్యాధులు దాడిచేసినా సులువుగా బయటపడేందుకు ఆయుర్వేద మందులను వినియోగం పెరిగింది. కొవిడ్‌ సమయంలో ప్రజలు ఆయుర్వేద మందులను అధికంగా వాడారు. ఇప్పటికీ గ్రామాల్లో మోకాళ్ల నొప్పులు, ఇతర రకాల జబ్బులకు ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలు ఆశ్రయిస్తున్నారు.

గతంలో కంటే కరోనా తర్వాత ఆయుర్వేద వైద్యానికి మూడు రె ట్లు అధిక ఆదరణ పెరిగిందని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోనికి తీసుకున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆయూష్‌ శాఖ ఆధ్వర్యంలో అందించే ఆయుర్వేద వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు పీహెచ్‌సీల్లో అల్లోపతి (ఎంబీబీఎస్‌) వైద్యుడితోపాటు ఆయూష్‌ వైద్యుడిని అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. మరోవైపు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నుంచి తెలంగాణకు 421 ఆయూష్‌ వెల్‌నెస్‌ కేంద్రాలు మంజూరయ్యాయి. ఒక్కో కేంద్రానికి రూ.9లక్షల నిధులను ఖర్చు చేయనున్నారు. ఈ వ్యయాన్ని 60:40శాతం నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి. పీహెచ్‌సీల్లో ప్రత్యేకంగా ఆయూష్‌ వైద్యాలయంతోపాటు యోగా, ధ్యాన కేంద్రాలను కూడా నిర్మించనున్నట్లు అధికారులు చెప్పారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పీహెచ్‌సీల్లో ఆయూష్‌ వైద్య కేంద్రాల నిర్మాణం ప్రారంభమైంది. రానున్న రెండు, మూడు నెలల్లోనే ఇవి అందుబాటులోకి రానున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలకు పీహెచ్‌సీల్లోనే ఆయూష్‌ వైద్య సేవలు అందేవిధంగా చూసే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు ప్రత్యేకంగా అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement