హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆన్‌లైన్ మోసాలపై నిత్యం ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతూ అందరినీ అవగాహన కల్పిస్తున్న టీజీఆర్‌టీసీ ఎండీ వి.సి.సజ్జనార్ ఫేక్ వెబ్‌సైట్‌ను గుర్తించడంపై ఈ రోజు పోస్టు పెట్టారు. ఫేక్ వెబ్‌సైట్స్ నమ్మి ప్రజలు లక్షల్లో మోసపోతున్నారని, వాటిని ఈ విధంగా గుర్తించండి ఆయన వివరించారు. ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ పెరగడంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు పలు టెక్నాలజీని ఉపయోగించుకొని నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి ప్రజలను దోచేస్తున్నారు. అయితే ఈ నకలీ వెబ్‌సైట్లను గుర్తించడంలో అవగాహన కల్పించేందుకు సజ్జనార్ ట్వీట్ చేశారు.
నకిలీ వెబ్‌సైట్ గుర్తించాలి ఇలా…
నకిలీ వెబ్‌సైట్- ఒరిజినల్ వెబ్‌సైట్ మధ్య తేడాను గుర్తించలేక ప్రజలు సైబర్ వలలో చిక్కుకుంటున్నారని, లక్షల్లో మోసపోతున్నారని సజ్జనార్ తెలిపారు. ఏదైనా వెబ్‌సైట్ పేరులో యూఆర్ఎస్ ఉంటే కచ్చితంగా దీనికి ముందు హెచ్‌టీటీపీ అని ఉంటుందని, అలా లేదంటే అది నకిలీ వెబ్ సైటేనని స్పష్టం చేశారు. అంతేగాక వెబ్‌సైట్ ఓపెన్ చేసిన వెంటనే మరో వెబ్ సైట్ కి వెళుతుంటే కచ్చితంగా అది నకిలీదని గమనించాలని సూచించారు. ఇక అనుమానాస్పద వెబ్ సైట్ లపై 1930 కి ఫిర్యాదు చేయండి అని సజ్జనార్ చెప్పారు.