హైదరాబాద్, ఆంధ్రప్రభ : సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో అనుమానితుడుగా ఉన్న కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు గురువారం విచారించింది. వాదనలకు సమయం లేకపోవడంతో విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడతామని న్యాయమూర్తి జస్టిస్ ఎం లక్ష్మణ్ తెలిపారు. ఈ రోజు కోర్టు సమయం ముగిసే సందర్భంగా పిటిషన్ విచారణకువచ్చింది. ఈ సందర్భంగా ఉభయపక్షాలను ఉద్దేశించి తమ వాదనలకు ఎంత సమయం కావాలని న్యాయమూర్తి అడిగారు. సీబీఐ కౌన్సిల్ కనీసం గంట సమయం కావాలని బదులిచ్చారు. అదే విధంగా అవినాష్ రెడ్డి న్యాయవాది సీనియర్ కౌన్సిల్ ఉమామహేశ్వరరావు, వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతా నర్రెడ్డి తరపు న్యాయవాది ఎల్ రవిచందర్ కూడా తమకు కూడా అంతే సమయం కావాలని కోర్టుకు చెప్పారు.
ముగ్గురి తరపు న్యాయవాదుల అభిప్రాయాలు విన్నతర్వాత శుక్రవారం ఉదయం మొదటి కేసుగా ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడతానని న్యాయమూర్తి చెప్పి విచారణను వాయిదా వేశారు. హత్య కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ ) అవినాష్ రెడ్డికి రెండు సార్లు నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరవుతానని అవినాష్ రెడ్డి కూడా అంగీకరించారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురి కాగా కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. తన తల్లి తీవ్రమైన ఆరోగ్య సమస్యతోఆస్పత్రిలో చేరారని ఆమె ఆరోగ్యం కుదుటపడిన తర్వాత విచారణకు హాజరవుతానని అవినాష్ రెడ్డి తరపున ఆయన న్యాయవాదులు సీబీఐకి లేఖ ఇచ్చారు.
విచారణకు హాజరవుతానని చెప్పి హాజరుకాకపోవడంతో సీబీఐ సీరియస్ అయింది. కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలోఉన్న అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ఇటీవల సీబీఐకి చెందిన రెండు అధికారుల బృంధాలు కర్నూలుకు వెళ్లారు. అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తున్నామని, అరెస్టుకు సహకరించాలని కూడా ఎస్పీకి లేఖ ఇచ్చింది.అవినాష్‌ను అరెస్టుచేస్తున్నారన్న సమాచారంతో కర్నూలులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.వైసీపీకి చెందిన కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యేలు కూడా విశ్వశాంతి ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఏం జరుగుతుందో అనే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల మధ్య మరోసారి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను అవినాష్ రెడ్డి దాఖలు చేశారు.
ఈ దరఖాస్తును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు జస్టిస్ కేజే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నర్సింహ ధర్మాసనం హైకోర్టు వెకేషన్ బెంచ్‌లోనే పిటిషన్ వేసుకోవాలని సూచించింది. విచారణ సందర్భంగా ముందస్తు బెయిల్ కోరే హక్కు పిటిషన్‌కు ఉందని చేసిన వ్యాఖ్యలు అవినాష్ రెడ్డికి ఊరటగా చెప్పవచ్చు. సుప్రీం ఆదేశాల మేరకు వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనంలో విచారణ మొదలైంది. ఇదిలా ఉండగా, హైకోర్టు రెగ్యులర్ బెంచ్‌లో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతున్నవిషయం తెలిసిందే. ఏప్రిల్ 28 న పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జూన్ 5 కి విచారణను వాయిదా వేసింది.