Tuesday, November 19, 2024

‘మొబిలిటీ వ్యాలీ’తో ‘ఆటో’ పెట్టుబడుల జోరు.. వికారాబాద్‌ జిల్లాలో ఏర్పాటు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోకి ఆటోమొబైల్‌ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే వికారాబాద్‌ జిల్లాలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడంతో పాటు అందుకు కావాల్సిన మౌళిక సదుపాయాలను శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. మొబిలిటీ వ్యాలీ నిర్మాణంలో ప్రపంచంలోనే పేరొందిన ఆటోమొబైల్‌ తయారీ కంపెనీలను భాగస్వామ్యం చేస్తోంది. వ్యాలీలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యేందుకు పలు ప్రపంచ ప్రసిద్ధి గాంచి కంపెనీలు ముందుకు వచ్చాయి. కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్‌ ఇప్పటికే రూ.1400 కోట్ల పెట్టుబడులు పెట్టి వ్యాలీలో ప్రభుత్వంతో కలిసి అత్యుత్తమ ప్రమాణాలతో మౌళిక సదుపాయాలుఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే కోవలో మరిన్ని కంపెనీలు ముందుకు వస్తున్నట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌(ఓఈఎమ్‌), ఆటోమొబైల్‌ విడిభాగాల తయారీ, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకంపెనీలు, పరిశోధన,అభివృద్ధి కేంద్రాలు, కొత్త తరం స్టార్టప్‌లు అన్నీ ఒకేచోట ఉండేలా మొబిలిటీ వ్యాలనీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ అడ్వాన్స్‌ ఆటో పార్ట్స్‌ కంపెనీ గ్లోబల్‌ కేపబిలిటీ కేంద్రం(జీసీసీ) ప్రారంభం సందర్భంగా మొబిలిటీ వ్యాలీలో పెట్టుబడి పెట్టాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ కంపెనీ ప్రతినిధులను కోరారు.

రాష్ట్రంలో పెరిగిన ఆటోమొబైల్‌ పెట్టుబడులు…

ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యాపారనుకూల విధానాల వల్ల రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ఇటు ఐసీ ఇంజన్‌, అటు ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో పెట్టుబడులు జోరుగా వస్తున్నాయి. జహీరాబాద్‌లోని ఇప్పటికే ప్రముఖ ట్రాక్టర్లు, ఎస్‌యూవీ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ తన తయారీ యూనిట్‌ను నెలకొల్పింది. దీనికి తోడు ఇటీవలే ఎలక్ట్రిక్‌ వాహనాలకు తక్కువ బరువు గల ఆటో విడిభాగాలు తయారు చేసే లైట్‌ ఆటో కంపెనీ వెయ్యి కోట్లపైన పెట్టుబడులు ప్రకటించింది. ఇవి కాక ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రోత్సాహక విధానాల వల్ల వేల కోట్ల పెట్టుబడులు రానున్న రోజుల్లో రాష్ట్రానికి రావడం ఖాయమని పరిశ్రమల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీ కారణంగా ఈ పెట్టుబడుల రాక మరింత వేగం పుంజుకొని రాష్ట్రంలోని వేలాది మంది యువతకు ప్రత్యక్ష,పరోక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement