Tuesday, November 26, 2024

పుష్కరాల‌కు వ‌చ్చే భ‌క్తుల‌ను దారిమళ్లిస్తున్న అధికారులు.. బోసిబోతున్న త్రివేణి సంగమం

భూపాలపల్లి/మహాదేవపూర్‌, ప్రభన్యూస్‌: దక్షిణ అరణ్యక్షైవ క్షేత్రంగా పేరుగాంచిన కాళేశ్వరంలో బుధవారం నుండి ఈ నెల24 వరకు ప్రాణహిత పుష్కరాలు జరుగనున్నాయి. అయితే పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన అధికార యంత్రంగం బాధ్యతలు భారంగా భావించి పొరుగున పుష్కరాలు జరిగే మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచకు భక్తులను తరలిస్తుండటంతో కాళేశ్వర క్షేత్రంతో పాటు త్రివేణి సంగమ పుష్కర ఘాట్‌లు బోసిబోయి దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకున్నా జిల్లా కలెక్టర్‌ రూ.49 లక్షలతో తాత్కాలిక పనులు చేపట్టి భక్తులకు సౌకర్యాలు కల్పించారు.

కానీ అవి నిరుపయోగంగా మారాయని భక్తులు, కాళేశ్వర గ్రామ ప్రజలు వాపోతున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు కాళేశ్వరం రాగానే ముందుగా బారికేడ్లు దర్శనమిస్తున్నాయి. దీంతో అక్కడి నుండే ట్రాఫిక్‌ను నేరుగా కాళేశ్వరంలోకి అనుమతించకుండా అంతరాష్ట్ర వంతనే మీదుగా డైవర్ట్‌ చేస్తున్నారు. దీంతో భక్తులు సిరొంచలోని పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించి అక్కడి నుండి తిరిగి తమ తమ ప్రాంతాలకు వెనుతిరుగుతున్నారు. కాళేశ్వరంలోకి వచ్చే భక్తులకు కూడా అనుమతి లేని పరిస్థితి ఏర్పడిందని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు.

అయోమయాని గురి చేస్తున్న అధికారుల తీరు
కాళేశ్వరంలో బుధవారం ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం కాగా అధికార యంత్రాంగం తాత్కాలిక పనులు చేపట్టడంతోపాటు వివిధ శాఖల సిబ్బందిని నియమించారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా , దేవాదాయశాఖ వరంగల్‌ జోన్‌ డిప్యూటీ కమీషనర్‌ శ్రీకాంత్‌ రావు ,ఏసీ సునిత , ఎస్పీ సురేందర్‌ రెడ్డిలు పర్యవేక్షించారు. కానీ గురువారం నుండి సీన్‌ రివర్స్‌ అయింది. భక్తులకు సరైన ఏర్పాట్లు అందించలేకపోయామనేమో కానీ భక్తులను నేరుగా కాళేశ్వరంలోకి అడుగుపెట్టనీయకుండానే దారిమళ్ళీస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలుతోనే కింది స్థాయి అధికారులు ఈ పని చేస్తున్నట్లు అర్థమవుతుంది. బుధవారం వరకు హడావిడి చేసి అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పిన అధికారులు ఇప్పుడు భక్తులను దారిమళ్ళీంచడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో కాళేశ్వరంకు వచ్చే భక్తులు అయోమయానికి గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement