Friday, January 24, 2025

TG : కమలాపూర్ గ్రామసభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ బాహాబాహి

వేదిక‌పైకి కోడుగుడ్లు, ట‌మాటో విసిరిన కాంగ్రెస్ శ్రేణులు
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కాన్వాయ్‌పై చెప్పులు

కమలాపూర్, ఆంధ్రప్రభ : కమలాపూర్ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శుక్ర‌వారం జ‌రిగిన గ్రామ‌స‌భ గంద‌ర‌గోళంగా మారింది. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కార్యకర్తల మ‌ధ్య‌ తోపులాట చోటు చేసుకుంది. గ్రామసభకు ముఖ్య అతిథిగా హాజరైన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎందుకు అమలుపరచడం లేదని ప్రశ్నించారు. దీంతో కౌశిక్‌రెడ్డిపై కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు టమాటోలు, గుడ్లు విసిరారు. బీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు నినాదాలు చేశారు. ఈ క్ర‌మంలో ఈ క్ర‌మంలోనే కుర్చీ విసురుకున్నారు. దీంతో స‌భ గం ద‌ర‌గోళంగా మారింది.

ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు
గ్రామసభలో తోపులాట‌లు జ‌ర‌గ‌డంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి సభ నుంచి బయటికి పరుగులు తీశారు. ఇక్కడ ఏం జరుగుతుందో అనే భయాందోళన చెందారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కాంగ్రెస్ కార్యకర్తలను ఒకవైపు, బీఆర్ఎస్ కార్యకర్తలను మరొకవైపు చెదరగొట్టారు. దీంతో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం స‌ద్దుమ‌ణిగింది. గ్రామసభను మళ్లీ ప్రారంభించారు.

- Advertisement -

గ్రామ‌స‌భ నుంచి వెళ్లిపోయిన పాడి
సభ జరుగుతుండగానే కాంగ్రెస్ కార్యకర్తలు సభ వేదిక పైకి గుడ్లు విసిరారు. అయితే మండల వ్యవసాయ అధికారి రాజకుమార్ పై గుడ్లు ప‌డ్డాయి. దాంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సభా వేదిక నుండి వెళ్లిపోవడానికి వేదిక దిగుతున్న సందర్భంలో ఇరువర్గాల మధ్య‌ మళ్లీ గొడవ జరిగే పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అక్కడి నుండి వెళ్లిపోయేంతవరకు పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఎమ్మెల్యే కాన్వాయ్ పై గుర్తుతెలియని వ్యక్తులు చెప్పు విసిరారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సభ వేదిక నుండి వెళ్లిన తర్వాత గ్రామ సభను అధికారులు కొనసాగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement