మంచిర్యాల, జూన్ 2 (ప్రభ న్యూస్): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పట్టణ ప్రధాన కార్యదర్శి గడప రాకేష్ పై ఆదివారం కొందరు దాడి చేసి, ఆయన కారును కూడా ధ్వంసం చేశారు. దాడిలో గాయపడ్డ రాకేష్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దాడి విషయమై ఆయనను వివరణ కోరగా… తాను హైటెక్ సిటీలోని జీహెచ్ఆర్ అపార్ట్ మెంట్ సమీపంలో నివాసం ఉంటానని, రోజు లాగానే ఉదయం జిమ్ కు కారులో వెళ్తుండగా.. ఎమ్మెల్యే నివాసానికి సమీపంలో 100 ఫీట్ల రోడ్డులో వెనుక నుండి ఓ వ్యక్తి బైక్ తో తన కారును ఢీకొట్టాడని, ఏమైందో అని కారు దిగి చూసే సరికి కారు వెనుక భాగంలో డ్యామేజ్ అయ్యిందని, అంతలోనే ముందు నుంచి మరో 15 బైక్ లపై కొంత మంది వచ్చి తనను రౌండ్ అప్ చేసి బేస్ బాల్ స్టిక్స్, ఇనుప రాడ్లతో దాడి చేయడంతో పాటు తన కారును కూడా పూర్తిగా ధ్వంసం చేశారని తెలిపారు.
పథకం ప్రకారంగానే తనపై దాడి జరిగిందని, ఈ దాడి వెనుక మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి జగన్ మోహన్ రావు హస్తం ఉందని, గ్యాంగ్ లను మెయింటైన్ చేస్తూ ఇలా దాడులకు పాల్పడుతున్నారని, ఈ మధ్యకాలంలో పట్టణంలో జరిగిన పలు దాడుల్లో కూడా వీరి హస్తం ఉందంటూ ఆయన ఆరోపించారు. పట్టణంలో తరచూ ఇలాంటి దాడులు చోటుచేసుకుంటుండడంతో ప్రజలు సైతం భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఈ దాడి విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.