వికారాబాద్ – లగచర్ల ఘటన కేసులో సంగారెడ్డి జైలులో 37 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న 17 మంది రైతులు ఈ ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు రాగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మేరకు వారికి గిరిజన సంఘాలు, బీఆర్ ఎస్ నాయకులు స్వాగతం పలికారు. కాగా, ఈ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నిందితులకు నాంపల్లి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా, రైతులు గురువారమే జైలు నుంచి విడుదల కావాల్సి ఉన్నా.. బెయిల్ పత్రాలు జైలు అధికారులకు ఆలస్యంగా అందాయి.
దీంతో ఈ ఉదయం రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు ఇదే కేసులో ఏ1గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా మొత్తం 24 మందికి నాంపల్లి ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నాంపల్లి కోర్టు నరేందర్ రెడ్డికి రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. 50,000 చొప్పున చెల్లించాలని, 3 నెలల పాటు వారానికి ఒకసారి బొంరాస్‌పేట ఎస్‌హెచ్‌ఓ ఎదుట హాజరుకావాలని, విచారణకు సహకరించాలన్నారు.
అదేవిధంగా, అదే కేసులో నిందితులుగా ఉన్న ప్రతి ఒక్కరికీ 20 వేలు పూచీకత్తు ఇవ్వాలని షరతులు విధించింది. ప్రతి వారం పోలీసుల ముందు హాజరు కావాలని ఆదేశించింది.. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు భోగమోని సురేష్‌తోపాటు మరో ఏడుగురికి బెయిల్ లభించలేదు.
విడుదలైన రైతులు మాట్లాడుతూ..మరోవైపు జిల్లా కలెక్టర్ పై దాడి ఘటనతో అస్సలు తమకు సంబంధం లేదని లగచర్ల రైతులు తెలిపారు. అయినా మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని వాపోయారు. కరెంట్ బంద్ చేసి అర్ధరాత్రి ఇండ్లలో నుంచి పోలీసులు తీసుకువెళ్లారని తెలిపారు. బతుకు దెరువు కోసం సౌదీ వెళ్లేందుకు పాస్ పోర్ట్ అప్లై చేసుకుంటే ఈ కేసుతో క్యాన్సిల్ అయ్యిందని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రాణాలు పోయిన తమ భూములు ఇవ్వబోమని రైతులు తెల్చి చెప్పారు.