చేవెళ్లకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా కాళేశ్వరం తెలంగాణకు ఏటీఎంగా మారిందన్న ఆరోపణలు చేశారని, ఈ ఆరోపణ భాజపాకు వర్తిస్తుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏటీఎం అంటే ఆదాని టూ మోడీ అంటూ హేళన చేశారు. చేవెళ్లకు అమిత్ షా వస్తున్నారని మాజీ మంత్రులు, కీలక నేతలు భాజపా తీర్థం పుచ్చుకుంటున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారని, చివరకు అమిత్ షా సమక్షంలో ఒక్క వార్డు మెంబరు కూడా ఆపార్టీలో చేరలేదని దుయ్యబట్టారు.
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: స్వతంత్య్ర భారత దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద అవినీతిపరుడిగా పేరు తెచ్చుకున్నాడని, మోడీ హయాంలో భారీఎత్తున అవినీతి చోటు చేసుకుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ హయాంలో రూపాయి విలువ భారీగా పడిపోయిందని, 30ఏళ్లలో లేని నిరుద్యోగం భాజపా హయాంలో తాండవిస్తోందని, ఎల్‌పీజీ సిలిండర్ ధర ఆకాశన్నంటుతోందని విరుచుకుపడ్డారు. ఏ ప్రధాని చేయని అప్పులను మోడీ చేశాడని, ఇప్పటిదాకా దేశాన్ని పాలించిన ప్రధాన మంత్రులు రూ.56 లక్షల కోట్ల అప్పులు చేస్తే నరేంద్ర మోడీ ఈ ఎనిమిదేళ్లలో 1.14లక్షల కోట్ల అప్పులు చేసి ఘనత చాటుకున్నారని దుయ్యబట్టారు. అన్ని రంగాల్లో విఫలమైన ప్రధాని మోడీ అట్టర్‌ప్లాఫ్ ప్రధానిగా పేరు ప్రఖ్యాతులు సాధించారని ఆరోపించారు.
తెలంగాణలో బీజేపీ శిఖండి రాజకీయం చేస్తోందని మహాభారతంలో శిఖండి యుద్ధం తరహాలో బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా మార్చిన ప్రధాని మోడీ గవర్నర్లను అడ్డుపెట్టుకుని నాటకాలు అడుతున్నారని చెప్పారు. బ్రిటీష్ హయాంలో ఏర్పడ్డ గవర్నర్ వ్యవస్థ అవసరమా..? అంటూ కేటీఆర్ నిలదీశారు. కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లిd తదితర భాజపేతర రాష్ట్రాల్లో గవర్నర్లు పెత్తనం చెలాయిస్తూ అక్కడి ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు చత్తీస్‌గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న గవర్నర్లు అక్కడి ప్రభుత్వాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నా యని, కేవలం భాజపేతర రాష్ట్రాల్లోనే గవర్నర్లు ప్రభుత్వా లను ఇరుకునపెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్లే పెత్తనం చెలాయిస్తుంటే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు..?, అసెంబ్లిdలో చేస్తున్న చట్టాలు ఎందుకు..?, ప్రజా ప్రతినిధులు ఎందుకు..? అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ల వ్యవస్థ, పాత్రపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ పనిచేసినపుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఇన్‌కంట్యాక్స్ పై ఒంటికాలిపై లేచారని, వీటికి విశ్వసనీయత లేదని ఆరోపణలు గుప్పించారని, ప్రధానమంత్రి పీఠం ఎక్కగానే ఆ దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని విపక్ష పార్టీలపై దాడులు చేయిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీ పేరు చెప్పాలని ప్రస్తుత హోంశాఖ మంత్రి అమిత్ షా తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తు చేశారు. దేశంలో 105 చోట్ల ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిందని, ఒక్క గుజరాత్ రాష్ట్రంలోనే అనేకమార్లు పోటీ పరీక్షల పేపర్లు లీకయ్యాయని అప్పుడు అక్కడి గుజరాత్ భాజపా ప్రభుత్వం రాజీనామా చేసిందా..? అని కేటీఆర్ ప్రశ్నిం చారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై ఆ ప్రభుత్వాలు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపాయా..? అని ప్రశ్నిం చారు. తెలంగాణలో జరిగిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై జరుగుతున్న సిట్ విచారణపై తమకు నమ్మకం ఉందని, తెలంగాణ పోలీసులంటే దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. న్యాయవ్యవస్థలపై, దర్యాప్తు సంస్థలపై తమకు నమ్మకం, విశ్వాసం ఉందని ఉద్ఘాటించారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా తమ పదవులు శాశ్వతమనుకుంటున్నారని, ప్రజలు ఆగ్రహిస్తే వీరు అడ్రస్ గల్లంతు లేకుండా పోతారని చెప్పారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా తన పదవి శాశ్వతం అంటూ ఉవ్విళ్లూరారని చివరకు కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన భాజపాలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. తెలంగాణ భాజపా నేతలు ప్రతి అంశాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకుంటున్నారని, ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తూ ప్రమాణాలు చేయాలని కోరడం విడ్డూరంగా ఉందని, ప్రధాని మోడీకి, అదానీకి ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర భాజపా నేతలు మోడీ తలమీద చేయిపెట్టి ప్రమాణం చేయగలరా..? అని ప్రశ్నించారు. దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రధాని మోడీ సఫారీలకు వెళ్లి పులులను చూస్తూ కాలం వెళ్లదీస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన 50మందిలో 48 మంది గుజరాతీయులేనని, దీన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులంటూ విపక్ష పార్టీల నేతలను దుయ్యబడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికలు జరుగుతున్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వాన్ని మాత్రం భాజపా ఏర్పాటు చేస్తుందన్న ప్రచారం జరుగుతోందని, బీజేపీ విల్ లూస్ ఎలక్షన్స్ బట్ ఫామ్ గవర్నమెంట్ అంటూ రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయని గుర్తు చేశారు. పార్టీలను చీల్చడం, ఎమ్మెల్యేలను కొనడం భాజపాకు అలవాటుగా మారిందని ఆరోపించారు. వేలాది కోట్ల రూపాయలు భాజపా ఖాతాలోకి వచ్చి పడుతున్నాయని, ఈ డబ్బుతో ఏదైనా చేస్తామని ఆ పార్టీ భయానకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.