నిర్మల్ ప్రతినిధి, ఏప్రిల్ 5 (ప్రభ న్యూస్) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయాలపై ఉన్న ప్రేమ, రైతులపై లేదని, రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన రైతు సత్యాగ్రహ దీక్షకు ఆయన హాజరై మాట్లాడారు. సర్కార్ కు ముందుచూపు లేకపోవడంతోనే పంటలు ఎండిపోయాయన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా.. సాగునీరు, విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం చేశారన్నారు. ఎన్నికల సమయంలో అన్నదాతలకు అబద్ధపు హామీలు ఆశ చూపి అధికారంలోకి వచ్చారన్నారు. ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ ఇవ్వలేదన్నారు.
పంటకు రూ. 500 బోనస్ ఇవ్వలేదని, రూ.15000 రైతు భరోసా సాయం ఇవ్వలేదన్నారు. కౌలు రైతులకు రూ.12000 సాయం ఇవ్వలేదన్నారు. సాగు నీరు లేదు, సబ్సిడీలు లేవన్నారు. ఇప్పుడు పంటలు ఎండిపోతే పరిహారం ఇచ్చే దిక్కు లేదన్నారు. వెంటనే పంట నష్టపోయిన రైతులకు సాయం అందించాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీల విషయంలో అన్నదాతలకు క్షమాపణ చెప్పాలన్నారు. దమ్ముంటే హామీలు అమలు చేశాకే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి రావాలన్నారు. లేకుంటే ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.