హైదరాబాద్ – శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎట్ హోం కార్యక్రమం రాత్రి వరకు కొనసాగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారంలోని శీతాకాల విడిది భవన ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమానికి అధికార పార్టీతోపాటు.. విపక్ష పార్టీ ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందింది.
దీనిలో భాగంగా బీఆర్ఎస్ అగ్రనేతలు, బావాబామ్మర్దులు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ బొల్లారం బయలు దేరారు. తెలంగాణ భవన్ నుంచి ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. కేటీఆర్ స్వయంగా డ్రైవింగ్ చేస్తుండగా హరీష్ రావు ఆయన పక్కన కూర్చొని కనిపించారు.ఈ ఫొటోలను హరీశ్ రావు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేయగా ఇవి వైరల్ గా మారాయి. కాగా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సర్జరీ తర్వాత.. బీఆర్ఎస్ పార్టీని నడిపించే బాధ్యతను కేటీఆర్, హరీష్ రావు తీసుకున్నారు. ఇద్దరూ వరుసగా సమావేశాల్లో పాల్గొంటూ.. పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలలో తమ పార్టీ వాణిని బలంగా వినిపించారు..అధికార పక్షానికి ధీటుగా సభలో ఈ నేతలిద్దరూ చెలరేగిపోయారు..