సర్కార్ వద్ద పైసల్లేవని, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్పారని, అట్లాంటప్పుడు ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలతోపాటు మేనిఫెస్టో హామీలను అమలు చేయడానికి మీ దగ్గరున్న ప్రణాళిక ఏమిటో అసెంబ్లీ వేదికగా ప్రజల ముందుంచాలని ఎంపీ బండి సంజయ్ కోరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని రంగాపూర్‌లో ఉదయం గ్రామమంతా కలియ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామస్థులతో ముచ్చటించారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఒకాయనేమో(సీఎం రేవంత్ రెడ్డి) అసెంబ్లీలో మీ సంగతి తేలుస్తానంటడు.,.. ఇంకొకాయనేమో (కేసీఆర్) నువ్వు నన్ను టచ్ కూడా చేయలేవంటడు… అసెంబ్లీ పెట్టుకునేది వీళ్తు ఒకరికొరు తిట్టుకోవడానికేనా? మరి ప్రజల బతుకుల సంగతి తేల్చేదెవరు? మీరు తిట్టుకోవాలంటే పరేడ్ గ్రౌండ్ మైదానాన్ని నేనే బుక్ చేస్తా… తిట్టుకుంటారో.. కొట్టుకుంటారో అక్కడే తేల్చుకోండి. అసెంబ్లీని మాత్రం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడానికి వేదికగా మార్చండి’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని, ప్రజలకిచ్చిన హమీలపై కాంగ్రెస్, గత ప్రభుత్వ తప్పిదాలపై బీఆర్ఎస్ నేతలు ప్రజల ద్రుష్టి మళ్లించేందుకే అసెంబ్లీ వేదికగా ఒకరికొకరు తిట్టుకునే కార్యక్రమానికి తెరదీశారని అన్నారు. కోరారు. రేషన్ కార్డు ప్రాతిపదికగా రూ.500ల కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు కరెంట్ ఛార్జీల మాఫీ హామీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అన్యాయమన్నారు.
గత పదేళ్లుగా అన్ని అర్హతలున్నప్పటికీ 10 లక్షల కుటుంబాలకుపైగా ప్రజలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని, వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని వారంరోజుల్లో అందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేలా యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెలలో ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయనే విషయం సాధారణ ప్రజలకు సైతం అర్ధమైందని, అయినప్పటికీ 6 గ్యారంటీలను ఇంకా అమలు చేయకుండా జాప్యం చేస్తూ ఎన్నికల నోటిఫికేషన్ పేరుతో తప్పించుకుంటే కుదరదన్నారు. 6 గ్యారంటీలతోపాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఎకరానికి రూ.15 వేల రైతు బంధు ఇవ్వాల్సిందేనని, అట్లాగే మహిళలకు రూ.2,500లు, ఆసరా పెన్షన్ కింద రూ.4 వేలు, ఇండ్ల స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం అందించాల్సిందేనని అన్నారు. ముఖ్యంగా ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోపే రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరారు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, వెంటనే 2 లక్షల ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని, ఉద్యోగులను రాచిరంపాన పెట్టేలా ఉన్న 317 జీవోను సవరించాల్సిందేనని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ది మూడోస్థానమేనని చెప్పిన బండి సంజయ్ కుమార్ ఈ విషయం బీఆర్ఎస్ నేతలకు అర్ధమై ఎన్నికల నుండి ఏ విధంగా తప్పించుకోవాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారని చెప్పారు.