హైదరాబాద్ – తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు . ఈనెల 16కు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే తెలంగాణ తల్లిపై ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
అనంతరం మంత్రులు, సభ్యులు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇవాళ సాయంత్రం సచివాలయంలో తెలంగాణ తల్లి ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. అందరూ రావాలని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
తెలంగాణ అసెంబ్లీ, మండలి శీతాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీ ఎదుట నిరసనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.. అనంతరం సభ ప్రారంభం కాగానే తెలంగాణ తల్లి విగ్రహం నమూనా అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సభలో వివరణ ఇచ్చారు.
దీంతో సభలో కొద్దిసేపు సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. విగ్రహ నమూనాపై సభ్యులు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అధికారికంగా జరుపుకోవాలని సభ వేదికగా నిర్ణయించారు. అనంతరం శాసనసభను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.