హైదరాబాద్ – తమ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాలేదు అప్పుడే తమపై శాపనార్థాలు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని..రాష్ట్రాన్ని దివాలా తీయించిందని ఆరోపించారు. అయినప్పటికీ తాము ఉద్యోగులకు మొదటి తారీఖునే వేతనాలు ఇస్తున్నామన్నారు. మరోవైపు.. రైతుబంధుపై పదే పదే మాట్లాడుతున్నారని.. గతంలో వారు ఎలా వేసారో గుర్తు చేసుకోవాలన్నారు. 2018-19లో యాసంగి పంటకు రైతుబంధు ఐదు నెలలకు వేశారు.. 2019-20లో 9 నెలలు, 2021-22 నాలుగు నెలలు పట్టిందన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడుతూ, ఇదిలా ఉంటే.. రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అంటున్నారన్నారు. మీ ఉద్యోగం పోయింది అని మీరు దుఃఖంలో ఉన్నారని, . నిరుద్యోగ యువత అలాంటి దుఃఖంలో లేరని సీఎం రేవంత్ తెలిపారు. మీలాగా అంగట్లో ప్రశ్నాపత్రం అమ్మకానికి పెట్టబోమని, .. మీ పేషీల్లో లాగా మా పేషీల్లో పైరవీకారులు లేరని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీని పదేపదే వారసత్వ పార్టీ అని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని… కానీ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిందన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ కోసం చేసిన త్యాగం ఏమిటో చెప్పాలన్నారు. సోనియా గాంధీ ప్రధాని పదవిని వదులుకున్నారన్నారు. ఉద్యమం సమయంలో రాజీనామా చేసి మళ్లీ మూడు నెలలకు పదవులు స్వీకరించడమే వారు చేసిన పని అన్నారు. వీటిని త్యాగాలుగా చెప్పుకోవద్దని హితవు పలికారు. కలెక్షన్లు, ఎలక్షన్లు, సెలక్షన్లు బీఆర్ఎస్ తీరు అని ఆరోపించారు.
అమరులవడమో… హక్కులు సాధించడమో..
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై రేవంత్ రెడ్డి స్పందించారు. కేఆర్ఎంబీకి అప్పగించడంపై పోరాడాలంటే ప్రధాని మోదీతో కొట్లాడాలన్నారు. మరి మోదీ నల్గొండలో ఉంటారా? అక్కడ బీఆర్ఎస్ సభ ఎందుకు? అని ప్రశ్నించారు. కృష్ణా జలాలపై పోరాడాలంటే అమరులవడమో… హక్కులు సాధించడమే బీఆర్ఎస్ నేతలు చేయాలని… అందుకు ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. కేంద్రం ప్రాజెక్టులు తీసుకుంటే ధర్నా చేయాల్సింది ఢిల్లీలోనా? నల్గొండలోనా? అని నిలదీశారు. దమ్ముంటే ప్రాజెక్టుల కోసం నల్గొండలో కాకుండా ఢిల్లీలో దీక్ష చేయాలన్నారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకే 47తో పోలీసులను నాగార్జున సాగర్ వద్దకు పంపించారని… అది మన భూభాగమని… కేసీఆర్ అనుమతి లేకుండా జగన్ అక్కడకు పోలీసులను ఎలా పంపిస్తారని నిలదీశారు. మన ప్రాంతంలోకి వచ్చి తుపాకులు పెట్టి ఆక్రమించుకుంటుంటే ఇంటి దొంగలు లేకుండా నాగార్జున సాగర్ మీద ఏపీ పోలీసులు పహారా కాసే అవకాశం ఉంటుందా? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ళలో కూడా అణచివేతలు.. ఆధిపత్య ధోరణి కొనసాగిందని ఆరోపించారు. అందుకే మార్పు కావాలని ప్రజలు చూశారని తెలిపారు. దురదృష్టవశాత్తు కేసీఆర్ ఇవాళ సభకు రాలేదని.. 80 వేల పుస్తకాలు చదివిన మేధావి కేసీఆర్.. ఆయన మేధావితనంతో సలహాలు సూచనలు ఇస్తే బాగుండేది అని అన్నారు. వారి సూచనలు తీసుకుని గౌరవిస్తాం.. కానీ ప్రతిపక్ష నేత సీటు ఇలా ఖాళీగా ఉండటం మంచిది కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రజలు ఇచ్చిన బాధ్యత నెరవేర్చాలి అని తెలిపారు. తాము 60 రోజుల పాలన పూర్తి చేసుకున్నామని, .. గతంలో చాలా లోపభూయిష్టంగా నిర్ణయాలు జరిగాయని అన్నారు. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం మంచి నిర్ణయాలను అభినందిస్తారు అనుకున్నాం.. సవరించాల్సిన విషయాలు చెప్తారు అనుకున్నాం.. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకుల మెప్పుకోసం మాట్లాడారని ఆరోపించారు.
మరోవైపు.. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రజలు గుండెలపై TG అని రాసుకున్నారు అని సీఎం తెలిపారు. కేంద్రం కూడా TG అని నోటిఫై చేసిందని అన్నారు. కానీ వారి రాజకీయల కోసం TS అని పెట్టుకున్నారని చెప్పారు. ఇదిలా ఉంటే.. కాకతీయులపై తిరుగు బాటు చేసిన సమ్మక్క సారాలమ్మ జాతర చేసుకుంటున్నామని తెలిపారు. కాకతీయుల రాచరిక పోకడలు వద్దని రాష్ట్ర చిహ్నంలో కాకతీయుల రాచరికం ఉండొద్దు అని నిర్ణయం తీసుకున్నామన్నారు.
రాష్ట్ర గీతంగా ‘జయజయహే తెలంగాణ’ను మార్చుతామని వెల్లడించారు. ఈ గేయాన్ని తెలంగాణ కవి అందెశ్రీ ప్రజలకు అందించారని, ఈ పాట ద్వారా ఊపిరి పీల్చుకొని లక్షలాది మంది తెలంగాణ ఉద్యోమంలో పాల్గొన్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లు, నగరాలు, పట్టణాలు, పల్లెలు, గ్రామాలు, అన్ని వీధుల్లోనూ ఇదే గేయం మోర్మోగిందని సీఎం ప్రస్తావించారు. ‘జయజయహే తెలంగాణ’ నినాదంతో రాష్ట్రాన్ని సాధించారని, రాష్ట్రాన్ని సాధించిన ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా మారుతుందని వ్యాఖ్యానించారు. ఆ నాడు తెలంగాణ సాధన ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు నడిపించిన గొప్పదనాన్ని ఒక దళిత బిడ్డకు ఇవ్వకూడదన్న ఆలోచనతో, కుట్రతో నాటి పాలకులు జయజయహే తెలంగాణ గానాన్ని తెలంగాణలో వినిపించకుండా చేశారని, దాదాపు నిషేధించినంత పనిచేశారని ఆరోపించారు. అందుకే ఉద్యమస్ఫూర్తితో, ఉద్యమాలను గౌరవించే పార్టీగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహం సగటు తెలంగాణ బిడ్డలా లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే విగ్రహం ఓ తల్లిలా ఉంటుందని సీఎం రేవంత్ ప్రకటించారు. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని కూడా మార్చుతామని వెల్లడించారు. రాచరికపు ఆనవాళ్లు ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ విధానమని ఆయన పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు నచ్చడంలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర గేయం, చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు విషయంలో తమకు ఎలాంటి ఆశలు, ఆశయాలు లేవన్నారు. ఈ విషయంలో ఏవైనా సూచనలు, సలహాలు ఉంటే చెప్పాలని స్పీకర్‌కి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తాము 6700 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, సింగరేణిలో ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. వాళ్ళ ఇంట్లో మాత్రం కారుణ్య నియామకాలు జరిగాయి.. కానీ సింగరేణిలో జరగలేదని మండిపడ్డారు. త్వరలోనే 15 వేల పోలీసు ఉద్యోగాలు నియామకం చేపడతామన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు గోల పెట్టినా నియామకాలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గవర్నర్ కోటాలో ఒక మైనార్టీకి ఎమ్మెల్సీ ఇచ్చామన్నారు. సలహాదారులో షబ్బీర్ ఆలీకి అవకాశం ఇచ్చామని చెప్పారు. మైనార్టీలకు అన్ని రకాల అవకాశం ఇచ్చామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
డ్రైవర్ల కష్టాలు తెలుసుకునేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల ఆటోలో ప్రయాణించిన విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ పంచ్‌లు వేశారు. కృష్ణనగర్‌లో ఒకాయన ఆటో రాముడు ఉన్నాడని, అక్కడ మొత్తం సినిమాకు సంబంధించిన వాళ్లు, సురభి నాటకాలు వేసేవాళ్లు, జూనియర్ ఆర్టిస్టులు ఉంటారని కేటీఆర్‌ని ఉద్దేశిస్తూ అన్నారు. బీఆర్ఎస్‌కు చెందిన ఒక జూనియర్ ఆర్టిస్ట్ అక్కడేదో సమావేశానికి వెళ్లారని, అక్కడ ఆటో కనిపించిందని, ఆటో రాముడు ఆటో ఎక్కి ఆఫీస్‌కి పోయాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ ఆటో లోపల కెమెరా పెట్టారని, అతడు ఎక్కింది దిగింది షూటింగ్‌లు చేయడానికి ఈ కెమెరాను అమర్చారని విమర్శించారు.
ఇప్పటివరకు మహాలక్ష్మీపథకం కింద దాదాపు 15 కోట్ల 21 లక్షల మంది ఆడబిడ్డలు ప్రయాణించారు. రూ.535.52 కోట్లు ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చుపెట్టింది. ఒక మంచి పని చేసినప్పుడు అభినందించడానికి నోరు రాకపోయినా ఫర్వాలేదు. కానీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, నిరసన తెలుపుతూ ఒక ఆటోని తీసుకొచ్చి తగలబెట్టడం సరికాదు. కిరాయి డబ్బులే రావడం లేదు, సంసారం నడవడంలేదన్న ఆటో డ్రైవర్.. ఆటోని తగలబెట్టాడంటే అతడికి ఎన్ని డబ్బులు కావాలి? ఇలాంటి చర్యల ద్వారా తెలంగాణ సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారు? ఇంకో నటుడేమో రూ.100 పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాడు కానీ పది పైసల అగ్గి పెట్టె కొనుక్కోడు. అతడికి అగ్గిపుల్ల దొరకదు’’ అని సీఎం వ్యంగ్యాస్త్రాలు సంధించారు.