హైదరాబాద్ – అసలు ధరణిని ముందు కనిపెట్టింది కేసీఆర్ కాదని, 2010లోనే ఒరిస్సాలో ఈ-ధరణి తీసుకొచ్చారని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ సభ్యులు సభలో చర్చను పక్కదారి పట్టించేలా చూస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో నేడు జరిగిన భూ భారతి బిల్లు చర్చలో ఆయన మాట్లాడుతూ.. సభా మర్యాదలకు ఉల్లంఘన కలిగించి సభాపతి పైనే దాడి చేస్తామన్న ధోరణిలో బిఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్యాద లేకుండా స్పీకర్‌పైనే పేపర్లు విసిరేశారని మండిపడ్డారు. చర్యలు తీసుకునే పరిస్థితులు వచ్చినా స్పీకర్ ఓపికతో వ్యవహరించారని అన్నారు. భూముల కోసం ఎంతో మంది యోధులు త్యాగాలు చేశారు. అధికారం, అహంకారంతో కొంతమంది ఆధిపత్యం కోసం దాడులు చేశారు. భూమి కోసం, భుక్తి కోసం సాయుధ పోరాటం చేశారని గుర్తుచేశారు. భూమి కోసం సకల జనులు పోరాడిన సందర్భాలు ఉన్నాయన్నారు. చట్టాలతో యజమానుల హక్కులను కాపాడుకుంటూ వస్తున్నట్లు ప్రకటించారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ను పీవీ నరసింహా రావు తీసుకొచ్చారన్నారు. ఇందిరా హయాంలో అసైన్‌మెంట్ భూముల పంపిణీ జరిగిందని వివరించారు. యూపీఏ హయాంలోనే భూభారతి పేరుతో దేశవ్యాప్తంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు గుర్తుచేశారు. నిజామాబాద్‌లో పైలెట్ ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టారని సీఎం అన్నారు.
తెలంగాణలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది కూడా భూమి అన్నారు.
కానీ గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి మాత్రం రైతులను వారి భూములకు దూరం చేసిందన్నారు. ధరణి వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చాక అనేక అక్రమాలు జరిగాయి అన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడే దేశాల్లోని సంస్థ చేతికి ధరణి పోర్టల్ నిర్వహణను అప్పగించారని అన్నారు సీఎం రేవంత్. ఫిలిప్పీన్స్, సింగపూర్, కెమెన్ హైలాండ్స్, వర్జిన్ హైలాండ్స్ వంటి దేశాలకు రైతుల సమాచారం వెళ్లిందని తెలిపారు.
ధరణి పోర్టల్ నిర్వహణ ఏ కంపెనీ చేతిలోకి వెళ్ళినా సీఈఓ గా గాదే శ్రీధర్ రాజే ఉన్నారని పేర్కొన్నారు. శ్రీధర్ రాజు ద్వారా విదేశాలకు సమాచారాన్ని పంపించారని ఆరోపించారు. అత్యంత సున్నితమైన సమాచారాన్ని విదేశీయుల చేతిలో పెట్టారని.. ఈ తీవ్రమైన నేరానికి పాల్పడిన బాధ్యులకు తప్పకుండా శిక్ష పడాలన్నారు. విదేశాలకు వెళ్లి వివరాలు ఇవ్వాలని కోరినా వారు సహకరించడం లేదని తెలిపారు సీఎం రేవంత్.
ధరణి పోర్టల్ తో రైతుల సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారని అన్నారు సీఎం. ఈ పోర్టల్ నిర్వహిస్తున్న సంస్థ సిఈవో గాదే శ్రీధర్ రాజు ద్వారా డేటాను విదేశాలకు పంపించారని పేర్కొన్నారు. అక్కడ వాళ్ళు ఒక్క క్లిక్ కొడితే మన సమాచారం అంతా నాశనం అవుతుందని.. ఇక్కడి సర్వర్లు కూడా క్రాష్ అవుతాయని తెలిపారు. అందుకే మేము అధికారంలోకి రాగానే ఎంతోమంది నిపుణులు, మేధావులు, రైతు నేతలతో చర్చించి ధరణిని రద్దు చేశామని వెల్లడించారు.భూములపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ధరణి పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
భూ భారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
భూ భారతి బిల్లుకు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం లభించింది. ఆర్ఓఆర్ – 2020 ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తూ.. కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. భూ దస్త్రాలు, యాజమాన్య హక్కుల చట్టం – 2024 పేరుతోనే అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సభ్యుల చర్చ అనంతరం ఈ బిల్లుని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆమోదించారు. ఈ బిల్లుతో ప్రస్తుతం ఉన్న ధరణి రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేయనుంది ప్రభుత్వం. కొత్త చట్టం కింద రికార్డులను నమోదు చేస్తారు. గతంలో రద్దు చేసిన అనుభవదారుడి కాలమ్ ను మళ్లీ తీసుకురానున్నారు.