ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : తెలంగాణకు పేరు తెచ్చిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. టీమ్ ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగాలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు శాసనసభలో ఆయన ప్రకటన చేశారు. అనంతరం క్రీడా రంగానికి సంబంధించిన పలు సవరణ బిల్లులను సభలో భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. వీటికి మద్దతు తెలపాలని ప్రతిపక్షాలను ఆయన కోరారు.
ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ, ముచ్చర్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియం నిర్మించడానికి బీసీసీఐ ని కోరినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో స్పోర్ట్స్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ .. స్టేడియం నిర్మించే బాధ్యత బీసీసీఐదే అని చెప్పారు. ఇప్పటికే ప్రాథమిక చర్చలు ముగిశాయన్నారు. కావాల్సిన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు.
క్రీడాకారులకు ప్రోత్సాహకాలు
క్రీడాకారులను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. క్రీడల్లో రాణించేవారికి ప్రోత్సాహకాలను ఇస్తామన్నారు. స్పోర్ట్స్ కోసం రూ.361 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే ప్రతి మండలానికి ఒక మినీ స్టేడియం నిర్మిస్తామన్నారు. ఇంటర్ పాసైన భారత క్రికెటర్ సిరాజ్‌కు ఉద్యోగం ఇస్తున్నామని ప్రకటించారు. అలాగే బాక్సర్ నిఖేత్ జరీన్‌కు గ్రూపు-1 స్థాయి అధికారిగా నియమిస్తామని చెప్పారు.
వచ్చే సమావేశాల్లో స్పోర్ట్స్ పాలసీ
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో స్పోర్ట్స్ ప్రత్యేక పాలసీ బిల్లు తీసుకు వస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక పాలసీలో సమగ్రంగా వివరాలు పొందుపరుస్తామన్నారు.