హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 3న రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజున రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించను న్నారు. ఫిబ్రవరి 6న ప్రభుత్వం 2023-24 వార్షిక బడ్జెట్ ను ఉభయ సభలకు సమర్పించనుంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సూచనల మేరకు సోమవారం వివాదం సద్దుమణిగింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం రాజ్ భవన్‌కు వెళ్ళి విషయాన్ని తెలియజేశారు. ఇదివరకున్న సభా సాంప్రదాయాల ప్రకారం గవర్నర్‌ను అసెంబ్లిdకి ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా జీఏడీ, ప్రొటోకాల్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో అసెంబ్లిd బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థిక మంత్రి హరీష్‌రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, అసెంబ్లికార్యదర్శి వేదాంతం నర్సింహాచార్యులు ఇతర ఉన్నతాధికారులతో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. అలాగే బడ్జెట్ సమావేశాలకు ఒకరోజు ముందు (ఫిబ్రవరి 2న) మంత్రిమండలి సమావేశమై వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు గవర్నర్ ప్రసంగ పాఠాన్ని కూడా ఆమోదించవలసి ఉంటుంది. ప్రసంగ పాఠంలో పొందుపర్చవలసిన అంశాలు, వివిధ వర్గాల ప్రజలకు అందిన అభివృద్ధి ఫలాలు, ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యాలు, సాధించిన ఫలితాలు, ఖర్చుచేసిన నిధులకు సంబంధించిన అంశాలపై సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగానికి మార్గనిర్ద శం చేశారు.
సభ్యులకు సమాచారమిచ్చిన అసెంబ్లి సచివాలయం
ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 3న అసెంబ్లి ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఉంటు-ందన్న ప్రభుత్వ తాజా నిర్ణయంతో సమావేశాల షెడ్యూల్లో స్వల్ప మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది. గత సమావేశాలకు కొనసాగింపుగానే ఉభయసభలను వచ్చే నెల మూడో తేదీన మధ్యాహ్నం 12.10 గంటలకు సమావేశపరుస్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శాసనసభ సచివాలయం సమాచారం ఇచ్చింది. ఉభయసభల సభ్యులను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగించాలంటే ఈ ఏడాది మొదటి సమావేశం కావాల్సి ఉంటు-ంది.
అసెంబ్లిలో హరీష్, మండలిలో ప్రశాంత్
శాసనసభలో ఆర్థికమంత్రి టి.హరీష్‌రావు, శాసన మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర హైకోర్టు సూచనలతో సోమవారం మధ్యాహ్నం ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దవే, రాజ్‌భవన్ తరఫు న్యాయవాది అశోక్ ఆనంద్ మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే అంశం, గవర్నర్ ప్రసంగంపై ఓ స్పష్టత వచ్చింది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి అంగీకరించినట్లు- ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ఫలితంగా రాష్ట్ర బడ్జెట్ ఆమోదం విషయంలో తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. బడ్జెట్‌ను గవర్నర్ ఇప్పటి వరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.