హైదరాబాద్ : ఓల్డ్ సిటీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించాలని కోరారు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ . పాతబస్తీ అభివృద్ధికి ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీలో పాతబస్తీ అభివృద్ధిపై మాట్లాడుతూ, ఇమామ్లకు ఇప్పుడు రూ.12వేలు ఇస్తున్నారని, ఇక నుంచి రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మదర్సా బోర్డును కూడా ఏర్పాటు చేయాలన్నారు.
ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఒక్క ముస్లిం అభ్యర్థిని గెలిపించలేకపోయాయని, ఈ రెండు పార్టీలు ముస్లింల అభివృద్ధికి సహకరించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు దగ్గరగా ఉండటానికి వైఎస్ఆర్ మాత్రమే కారణమన్నారు. ఆయన హయాంలో మైనార్టీలకు న్యాయం జరిగిందన్నారు. పెండింగ్లో ఉన్న షాదీ ముబారక్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఓల్డ్ సిటీ రోడ్డు వెడల్పు పనులు పెండింగ్లో ఉన్నాయని, అభివృద్ధిపై సీఎం దృష్టి సారించాలన్నారు. డీఎస్సీలో ఉర్దూ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.