తెలంగాణలో ప్రజాపాలన మొదలైందన్నారు గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ . రాచరికం నుంచి తెలంగాణ విముక్తి పొందిందని, కొత్త సీఎం రేవంత్ రెడ్డి తాము పాలకులం కాదు సేవకులం అన్నారని తెలిపారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.. ముందుగా గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి కొత్తగా ఎన్నికైన సభ్యులకు, కొత్త పభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి ఇంగ్లీష్ లో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కొత్త ప్రభుత్వం ప్రజాసేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ తెలిపారు. తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని గవర్నర్ తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమంతో కొత్త ప్రభుత్వం ముందుకెళుతోందని తెలిపారు. బలిదానాలు చేసిన వారి త్యాగాలను గుర్తించాలన్నారు. పదేళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారని అన్నారు. నా ప్రభుత్వంలో తెలంగాణ స్వేఛ్ఛా వాయువులు పీల్చుకుంటోందని తెలిపారు. నియంతృత్వ పాలనా పోకడల నుంచి తెలంగాణ విముక్తి పొందిందని తెలిపారు. నిర్బంధాన్ని సహించబోమని విస్పష్టమైన ప్రజాతీర్పు వచ్చిందని.. ఈ తీర్పు పౌర హక్కులకు, ప్రజాస్వామ్య పాలనకు నాంది అన్నారు. పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయని అన్నారు. అడ్డుగోడలు, అద్దాల మేడలు పటాపంచలైపోయాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వ ప్రస్థానం మొదలైందని చెప్పడానికి గర్విస్తున్నానని తెలిపారు. చివరగా ప్రజాకవి దాశరధి రాసిన కవితను తెలుగులో వినిపించారు..
ఆ చల్లని సముద్ర గర్భం
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ||ఆ చల్లని||
భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో
కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో ||ఆ చల్లని||
మానవ కళ్యాణం కోసం పణమెత్తిన రక్తము ఎంతో
రణరక్కసి కరాళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో
కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో
భూస్వాముల దౌర్జన్యాలకు
ధనవంతుల దుర్మార్గాలకు
దగ్ధమైన బతుకులు ఎన్నో…
అంతకుముందు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్కు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఘనస్వాగతం పలికారు.