అశ్వారావుపేట : భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు యత్నించాడు. ఫోన్ లోకేషన్ ద్వారా గుర్తించిన పోలీసులు.. చికిత్స కోసం మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆదివారం ఉదయం 8:30 గంటలకు మఫ్టీలో స్టేషన్‌కు వచ్చారు. సోమవారం నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచనలు చేశారు.
అదే సమయంలో ప్రైవేట్ కారు రావడంతో డ్రైవర్‌ను దింపిన ఎస్సై.. ఇప్పుడే వస్తానంటూ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. మధ్యాహ్నం తరువాత సిబ్బంది ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో వెంటనే సీఐ జితేందర్‌రెడ్డికి సమాచారం అందించారు. ఆయన వెంటనే ఎస్సై ఫోన్ లోకేషన్‌ను ట్రాక్ చేయగా మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత మండలంలోని తిరుమలకుంట అటవీ ప్రాంతంలో స్విచ్ఛాఫ్ అయినట్టు గుర్తించారు. కానీ రాత్రి 10:45 గంటల వరకు ఆచూకీ లభ్యం లభించలేదు.
ఇంతలో మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్టు గుర్తించారు. వెంటనే ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.