Tuesday, November 26, 2024

న్యాయ శాస్త్రంలో అశ్వాపురం యువ‌కుడి అత్యుత్తమ ప్రతిభ

ప‌ట్టుద‌ల ఉంటే ఎంత‌టి ల‌క్షానైనా సాధింవ‌చ్చ‌ని నిరూపించాడు ఆ యువ‌కుడు. అంతేగాకుండా పలువురి ప్రశంసలందుకున్నాడు. ఇంత‌కీ ఎవ‌రు ఆ యువ‌కుడు.. ఏం సాధించాటు అంటే…. అశ్వాపురంకు చెందిన ఓ గిరిజ‌న విద్యార్థి న్యాయశాస్త్రంలో అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచాడు. పట్టుదలతో కృషిచేస్తే ఎంత‌టి లక్షాన్నైనా సులువుగా సాధించవచ్చని నిరూపించాడు. న్యాయ శాస్త్రంలో అత్యున్నత విశ్వవిద్యాలయమైన నల్సార్ యూనివర్సిటీ అఫ్ లా లో సీటు సాధించి, యూజీసీ నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, జెఆర్ఎఫ్ లో అర్హత సాధించడమేకాక, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షల్లో మెరిట్ సాధించి ఏపీపీ ఉద్యోగం సాధించి గ్రామీణ యువతకు ఆదర్శంగా నిలిచాడు. యువతలో పట్టుదల ఉంటే ఎటువంటి అవకాశాలనైనా అందిపుచ్చుకోవచ్చునని నిరూపించారు. ఈ విద్యార్థి ప్రతిభను పలువురు అభినందిస్తున్నారు.


ఖ‌మ్మం జిల్లాలోని అశ్వాపురం మండల కేంద్రానికి చెందిన గిరిజన యువకుడు జి.అశోక్ శివరాం నాయక్. తండ్రి వీరాస్వామి ఓ ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. శివరాం నాయక్ అశ్వాపురంలో పదో తరగతి వరకు విద్యనభ్యసించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత శిఖరాలని అధిరోహించాలనే లక్ష్యంగా తన ఉన్నత చదువులు హైదరాబాద్, ఢిల్లీ, గుజరాత్ లో పూర్తి చేసాడు. డిగ్రీ, ఎల్ ఎల్ బి పూర్తి చేసిన అనంతరం అయన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (సీఏఎల్టీ) ప్రవేశ పరీక్షలో అత్యధిక స్కోరు సాధించి భారతదేశంలో కెల్లా అత్యున్నత ప్రతిష్టాత్మకమైన ‘ లా ‘ విశ్వవిద్యాలయమైన నల్సార్ విశ్వవిద్యాలయంలో సీటు దక్కించుకొని మాస్టర్ ఇన్ క్రిమినల్ లా పూర్తి చేసాడు. అంతటితో అగ‌లేదు.. అయన యూజీసీ నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, జూనియర్ రీసెర్చ్ ఫెల్లోషిప్ (జేఆర్ఎఫ్) లో అర్హత సాధించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తుండగానే ఆయనకు తెలంగాణ పోలీస్ అకాడమీలో పోలీస్ అధికారులకు న్యాయ శాస్త్రం పై శిక్షణ అందించే అవకాశం దక్కింది. దీంతో చిన్న వయసులోనే ఎంతో మంది పోలీసు అధికారులకు న్యాయ శాస్త్రంపై శిక్షణ అందించాడు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నిర్వహించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకానికి ఎంపికై కామారెడ్డి కోర్ట్ లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉద్యోగం సాధించాడు. అంతేకాక గ్రామీణ ప్రాంతం నుండి న్యాయ శాస్త్రంలో ఆసక్తి కనబరిచిన ఇద్దరు గ్రామీణ పేద విద్యార్థులకు ఆయన ఉచితంగా శిక్షణ అందించాడు. దీంతో వారు ఇరువురూ సైతం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉద్యోగం సాధించడం విశేషం. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… భవిష్యత్తులో తాను న్యాయ వ్యవస్థలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడమే కాక గిరిజన ప్రాంత వాసుల అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే న్యాయ శాస్త్రంలో రాణించాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులు, యువకులకు తన సలహాలు, సూచనలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. గ్రామీణ ప్రాంతం నుండి న్యాయ శాస్త్రంలో అత్యున్నత విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న యువకుడు అశోక్ శివ రామ్ నాయక్ ను పలువురు ప్రముఖులు అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement