Tuesday, November 19, 2024

దక్షిణ మధ్య రైల్వే ఇన్​చార్జి జనరల్​ మేనేజర్​గా అరుణ్‌ కుమార్‌ జైన్ బాధ్యతల స్వీకరణ..

దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌గా (ఇన్‌చార్జి) అరుణ్‌ కుమార్‌ జైన్‌ బాధ్యతలు చేపట్టారు. జోన్‌ యొక్క పాలనాపరమైన, ఆర్థిక పరమైన అధికారాలను ఆయనకు అప్పగిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీచేసింది. వాటిని అనుసరించి ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ఇండియన్‌ రైల్వేస్‌ సర్వీస్‌ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంజినీర్స్‌ (ఐఆర్‌ఎస్‌ఎస్‌ఈ), ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ 1986 బ్యాచ్‌కు చెందిన వారని అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వేలో అరుణ్​కుమార్​ ప్రిన్సిపల్‌ చీఫ్‌ సిగ్నల్‌ అండ్‌ టెలికామ్‌ ఇంజినీర్‌గా, హైదరాబాద్‌ డివిజన్‌ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌గా ఉన్నారు. డీఆర్‌ఎమ్‌గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో ఆయన డివిజన్‌లోని వివిధ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల కోసం వసతులను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సమయంలో భద్రత, పరిరక్షణ, పరివర్తనా రంగాలలో నాలుగు అత్యంత ప్రతిభా సామర్థ్య అవార్డులను డివిజన్‌ సాధించింది. ఆయన ఐఎన్‌ఎస్‌ఈఏడి, సింగపూర్‌, ఐసిఎల్‌ఐఎఫ్‌, మలేషియా, ఐఎస్‌బి హైదరాబాద్‌, ఎస్‌డిఏ బొకోని, మిలాన్‌లలో మేనేజ్‌మెంట్‌ శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేశారు.

అరుణ్‌ కుమార్‌ జైన్‌ గోరఖ్‌పూర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ నుండి బ్యాచిలర్స్‌ డిగ్రీని, ఖరగ్‌పూర్‌ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుండి కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. భారతీయ రైల్వేలో అసిస్టెంట్‌ సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యునికేషన్స్‌ ఇంజినీర్‌గా ఉద్యోగ బాధ్యతలను ప్రారంభించిన ఆయన మూడు దశబ్దాల సర్వీసులో మధ్య రైల్వే, ఉత్తర మధ్య రైల్వే, దక్షిణ మధ్య రైల్వేల్లో పలు కీలక బాధ్యతలలో విధులు నిర్వహించారు. ఈయన రీసెర్చ్‌ డిజైన్స్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్‌డిఎస్‌ఓ)లో కూడా బాధ్యతలు నిర్వహించారు. డిజిటల్‌ యాక్సిల్‌ కౌంటర్స్‌, సాలిడ్‌ స్టేట్‌ బ్లాక్‌, ట్రైన్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ వార్నింగ్‌ సిస్టమ్‌ (టిపిడబ్ల్యూఎస్‌), ట్రైన్‌ కొలిజిన్‌ అవాయిడెన్స్‌ సిస్టమ్‌ (టికాస్‌) వంటి అడ్వాన్స్‌ సిగ్నలింగ్‌ సిస్టమ్స్‌లో కీలక బాధ్యతలు పోషించారు. రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ అండ్‌ గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌గా కూడా పదవీ బాధ్యతలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement