Tuesday, November 26, 2024

ఇంజక్షన్​ మర్డర్​ కేసులో నిందితుల అరెస్ట్‌.. ఆ పనికి అడ్డువస్తున్నాడని హత్య చేయించిన భార్య

ఖమ్మం రూరల్‌, ప్రభన్యూస్‌: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని వల్లభి గ్రామ శివారులో సోమవారం జరిగిన సూదిమందు హత్య నిందితులను బుధవారం రాత్రి రూరల్‌ పోలీస్‌ స్టేషన్లో విలేకరుల ఎదుట పోలీసుల ప్రవేశపెట్టారు. ఏసీపీ బస్వారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… చింతకాని మండలం, నామవరం గ్రామానికి చెందిన గోదా మోహన్‌రావు(40) అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. చింతకాని మండలం, బొప్పారం గ్రామానికి చెందిన మృతుడు జమాల్‌ సాహెబ్‌(48) భార్య ఇమాంబీ(46)తో మోహన్‌రావుకు వివాహేత సంబంధం ఏర్పడింది.

తన భార్య మోహన్‌రావుతో అక్రమ సంబంధం పెట్టకున్న విషయం తెలిసిన జమాల్‌ సాహెబ్‌ కొద్దిరోజుల క్రితం భార్యను మందలించాడు. తన వివాహేతర సంబంధం విషయం భర్త తెలిసిందని అతనిని ఏవిధంగానైనా అడ్డు తొలగించుకోవాలని భావించిన భార్య ఇమాంబీ ప్రియుడు మోహన్‌రావుతో కలిసి హత్య చేసేందుకు పథకం పన్నింది. హత్య చేసేందుకు పూనుకున్న మోహన్‌రావు తన గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ బండి వెంకన్నను కలిసి తన వివాహేతర సంబంధం గురించి చెప్పి మనిషిని చంపడానికి కావలసిన ఇంజక్షన్‌ తీసుకురావాలని కోరాడు. వెంకన్న రూ. ఐదు వేలు ఇస్తే ఇంజక్షన్‌ తెప్పిస్తానని చెప్పాడు. మోహన్‌రావు రూ.3500 ఇచ్చాడు.

ఆర్‌ఎంపీ బండి వెంకన్న విషయం తన స్నేహితుడు యశ్వంత్‌కు చెప్పి అతనితో రెండు నియోవెక్‌ ఇంజక్షన్లు తెప్పించుకున్నాడు. ఈ విషయాన్ని ఆర్‌ఎంపీ వెంకన్న మరోవ్యక్తి వెంకటేష్‌తో మాట్లాడాడు. ఇమాంబీతో విషయాన్ని చెప్పి వెంకటేష్‌ ద్వారా ఇంజక్షన్‌ మృతుడికి వేయించాలని ఇమాంబీకి పంపించాడు. ఇమాంబీ వెంకటేష్‌కు ఇవ్వడం కుదరకపోవడంతో మళ్లీ మోహన్‌రావుకు ఇచ్చింది. మెహన్‌రావు వెంకటేష్‌కు ఇంజక్షన్‌ అందించాడు. 19వ తేదీన ఇమాంబీ తన భర్త ఆంధ్రప్రదేశ్లోని గండ్రాయి వెళుతున్నాడని మోహన్‌రావుకు ఫోన్‌ చేసి చెప్పింది. దీంతో ప్లాన్‌ అ్లప చేసిన మోహన్‌రావు వెంకన్న, వెంకటేశ్లకు చెప్పాడు. వారు రెండు బైకులపై వల్లభి వెళ్లి కాపు కాశారు. మృతుడు వల్లభి నుంచి బైకుపై గండ్రాయి వెళుతుండగా ఆర్‌ఎంపీ బండి వెంకన్న లిప్ట్‌ అడిగి బండి ఎక్కాడు.

కొద్ది దూరం వెళ్లిన తరువాత వెంకన్న బండి ఆపమని చెప్పి సూది వేసి బండి దిగి వెనుక వస్తున్న వెంకటేశ్‌ బైక్‌ ఎక్కి పారిపోయాడు. మృతుడు సృహతప్పి పడిపోగా స్థానికులు వల్లభి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. కేసు త్వరితగతిన చేధించిన రూరల్‌ సీఐ శ్రీనివాస్‌, ముదింగొండ ఎస్‌ఐ నాగరాజును ఏసీపీ బస్వారెడ్డి అభినందించారు. పోలీసులు అరెస్టు చేసిన నలుగురు నిందితులను నేడు రిమాండ్‌కు తరలించనున్నట్లు- ఏసీపీ బస్వారెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement