Friday, November 22, 2024

మోసం చేసి డబ్బులు దండుకుంటున్న ముఠా అరెస్ట్..

మహబూబ్ న‌గర్ క్రైమ్ : అమాయకమైన ప్రజలకు మాయమాటలు చెప్పి వారితో స్నేహం ఏర్పరచుకొని కొంతకాలం నమ్మకంగా ఉంటూ ఫేక్ కరెన్సీ నోట్లను కట్టలుగా అమర్చి వాటిని వీడియో తీసి కొంత డబ్బును కుప్పలుగా పోసి పూజలు చేస్తే అవి కోట్ల రూపాయలలో పెరుగుతాయని, రాగి చెంబుకు కెమికల్ పూసి మట్టిలో పూడ్చి పూజలు చేస్తే బంగారం అవుతుందని నమ్మించి,వారి మొబైల్ ఫోన్లో ఉన్న కొన్ని వీడియోల ఆధారంగా అమాయక ప్రజలను బుట్టలో వేసుకొని సులువుగా డబ్బులు దండుకునే ముఠాను శనివారం జడ్చర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ కే.నరసింహ మహబూబ్నగర్ పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐదు మంది నేరస్తులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ నర్సింహ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాలకు చెందిన చెంచు రంగస్వామి అతని భార్య భార్గవి, స్నేహితులు విష్ణు, ముల్ల శేఖర్, గడ్డం విజయ్ కుమార్, గడ్డం ప్రదీప్, గడ్డం దివాకర్ అనే ఏడు మంది నేరస్తులు ముఠాగా ఏర్పడి గత పది నెలలుగా అమాయకమైన ప్రజలకు మాయమాటలు చెప్పి డబ్బులు దండుకొని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. మిడ్జిల్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన వివేకానంద గౌడ్, కడ్తాల్ మండలం రావిచెడు గ్రామానికి చెందిన వెలుజర్ల మహేష్, తలకొండపల్లి మండలం చంద్రధాన గ్రామానికి చెందిన తింగిరి కార్ నరేష్, అదే గ్రామానికి చెందిన నిదురం శేఖర్, రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామానికి చెందిన జంగయ్య అనే వ్యక్తులతో ఈ ఏడుగురు నేరస్తులు గత పది నెలలుగా స్నేహంగా మెలుగుతూ వారికి నకిలీ కరెన్సీ నోట్లను ఆశ చూపి వాటిని కట్టలుగా అమర్చి కుప్పగా పోసి పూజలు చేస్తే అవి కోట్ల రూపాయలు అవుతాయని, అంతేకాక రాగి చెంబుకు కెమికల్ పూసి రేడియేషన్ పవర్ చేయగా అది బంగారంగా మారుతుందని ఆ చెంబును అమ్మితే రూపాయలు వస్తాయని నమ్మించారు. వారిని నమ్మించేందుకు వారి మొబైల్ ఫోన్లో ఉన్న వీడియోలను చూపించి వారి వద్ద నుండి 71 లక్షల 50 వేల నగదును ఎత్తుకెళ్లారని ఎస్పీ నరసింహ తెలిపారు.

నేరస్తులు ఎత్తుకెళ్లిన ఈ మొత్తం నగదును వారి స్వగ్రామంలో నాలుగెకరాల 49 సెంట్లు వ్యవసాయ పొలం కొనుగోలు చేశారని, అదేవిధంగా 18 లక్షలు విలువ గల మహేంద్ర థార్ వాహనాన్ని కూడా కొనుగోలు చేశారని చెప్పారు. మిగిలిన డబ్బును ఏడుగురు నేరస్తులు విలాసాలకు, విందులకు ఖర్చు చేశారని ఆయన వెల్లడించారు. అయితే బాధితుడు వివేకానంద గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన జడ్చర్ల పోలీసులు ముందస్తు సమాచారం తెలుసుకొని శనివారం మున్ననూరు టోల్ గేట్ దగ్గర నేరస్తులను పట్టుకొని విచారించి, వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి వారి దగ్గర నుండి మూడు కార్లు, 16 లక్షల 25 వేల విలువగల ఫేక్ కరెన్సీ నోట్లు, నాలుగు ఎకరాల 49 సెంట్లకు సంబంధించిన భూమి డాక్యుమెంట్స్, 5 మొబైల్ ఫోన్స్ గుర్తించి సీజ్ చేశామని ఎస్పీ నరసింహ చెప్పారు. వీరిలో రంగస్వామి భార్య భార్గవి, విష్ణు అనే ఇద్దరు నేరస్తులు పరార్ లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు కష్టపడి సంపాదించే సొమ్మును నమ్మాలని ఈజీగా వచ్చే సొమ్ముకు దురాశ చెంది ఇతరులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని ఎస్పీ అన్నారు. ముఖ్యంగా మాయమాటలు చెప్పి మోసం చేసే దుండగులను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ప్రజలకు ఆయన సూచించారు. అనంతరం పట్టుకున్న ఐదుగురు నేరస్తులను రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో కష్టపడి పనిచేసి నేరస్తులను పట్టుకున్న పోలీసులను అభినందించి, రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేష్, జడ్చర్ల సిఐ జములప్ప, మిడిల్ ఎస్సై రామ్ లాల్, సిసిఎస్ ఎస్ఐ శ్రీనివాస్ బాలానగర్ ఎస్సై జయప్రసాద్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement