కరీంనగర్ క్రైమ్ ఆంధ్రప్రభ హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ లో హై టెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాసేపట్లో వన్ టౌన్ పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తారా రిమాండ్ విధిస్తారా అనే అంశం కాసేపట్లో తేలిపోనుంది.
నిన్న రాత్రి హైదరాబాదులో కౌశిక్ రెడ్డి ని అరెస్ట్ చేసిన పోలీసులు కరీంనగర్ కు తరలించి మొదట పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఉంచారు. కొద్దిసేపటి అనంతరం అర్ధరాత్రి తర్వాత త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. న్యాయమూర్తి హాజరు పరిచే ముందు నిర్వహించే వైద్య పరీక్షలను సైతం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను పిలిపించి పోలీస్ స్టేషన్లోనే చేయించడం గమనార్హం.
కౌశిక్ రెడ్డి ని రెండు కేసుల్లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. కరీంనగర్ గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ తనను సమావేశంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు తో పాటు, జగిత్యాల ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసు కరీంనగర్ ఆర్డిఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసు ఒకే దాంట్లో క్లబ్ చేసి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
న్యాయమూర్తి ఎదుట తమ వాదనలు వినిపించేందుకు బిఆర్ఎస్ లీగల్ టీం కరీంనగర్ కు చేరుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.