ఆర్మూర్ బిజెపిలో అంతర్గత గ్రూపు రాజకీయాలతో విసిగిపోయిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. ఆయన రాసిన లేఖలో తన రాజకీయ నేపథ్యంతో పాటు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా తాను చేసిన కృషిని గుర్తు చేశారు.
పార్లమెంటు ఎన్నికలలో ఎంపీ అరవింద్ గెలుపు కోసం నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఎక్కడ రానంతటి 32వేల మెజారిటీ అందించానని అన్నారు. ఎంపీ అరవింద్ పార్టీలో అంతర్గత గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ, రోజుకో కొత్త నాయకున్ని ఆర్మూర్ బిజెపి అభ్యర్థి అంటూ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నాడన్నారు. నమ్మిన పార్టీ మరియు నమ్మిన నాయకుడే నాకు సహకారం అందించకపోవడం తో తీవ్ర అసహనానికి లోనయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
వినయ్ రెడ్డి రాజీనామా ఆర్మూర్ నియోజకవర్గ రాజకీయాలలో ఆసక్తికర చర్చకు తెరలేపింది. తదుపరి హస్తం గూటికి వినయ్ రెడ్డి చేరడం ఖాయమని తెలుస్తోంది.