హైదరాబాద్, ఆంధ్రప్రభ : వచ్చే నెల 17వ తేదీన నిర్వహించనున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్‌లోని బాటా నుంచి రాంగోపాల్ పేట పాత పోలీస్ స్టేషన్ వరకు చేపట్టిన వీడీసీసీ రోడ్డు నిర్మాణం, ఆలయ పరిసరాలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణ సమయానికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముందని, ఈ నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యానికి భక్తులు గురికారుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
తోపులాట లేకుండా పటిష్టమైన భారీకేడ్‌లను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆయన ఆదేశించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కల్గకుండా సీసీ కెమెరాలను, తగిన పోలీస్ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయాలను పోలీస్ అధికారులకు సూచించారు. అలాగే అమ్మవారికి బోనాలు తీసుకొచ్చే వారు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేయాలని పోలీసు, దేవాదాయ శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు, వాహనదారులు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ మళ్ళించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు వాటర్ ప్యాకెట్లు, బాటిళ్ళను అందుబాటులో ఉంచాలని వాటర్ వర్క్స్ అధికారులను అదేశించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.