Tuesday, November 26, 2024

Armoor – ఈ బ‌డిలోనూ ఓ కీచ‌కుడు…దేహ‌శుద్దితో పేరేంట్స్ స‌త్కారం

ఆర్మూర్ ప్రభ న్యూస్ – విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు నీచమైన పనులకు దిగజారుతున్నారు. మంచి చెడ్డలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల నీచ బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. విద్యార్థినులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు కామంతో కన్నుమూసుకుని పోయి వక్రబుద్ధిని చాటుకుంటున్నారు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ కీచక ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసిన ఘటన ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఉర్దూ పాఠశాలలోని చోటుచేసుకుంది.


మరిన్ని వివరాల్లోకి వెళితే…. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో పెర్కిట్ లో గల ఉర్దూ మీడియం ప్రైమరీ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థినులపై ఉపాధ్యాయుడు ఇబ్రహీం అనే అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.. దీనిపై ఇబ్రహీం టీచర్ పై గత పక్షం రోజుల క్రితమే విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయురాలు ఆసియాకు ఫిర్యాదు చేశారు.. రోజులు గ‌డుస్తున్నా ఆ ఉపాధ్యాయుడిపై చ‌ర్య‌లు తీసుకోలేదు.. ఈ నేప‌థ్యంలో ఎం ఈ ఓ రాజా గంగారాం కు ఫిర్యాదు చేయగా, ఆయన పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. బాధ్యులైన వారి పైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.. అయితే ఆ హామీ కూడా నెర‌వేర‌లేదు.. దీంతో త‌ల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడికి దేహ‌శుద్ది చేశారు.. విష‌యం తెలుసుకున్న ఎస్సై అశోక్ త‌న సిబ్బందితో అక్క‌డికి చేరుకుని పేరేంట్స్ తో మాట్లాడారు.. జ‌రిగిన విష‌యం వివ‌రించ‌డంతో ఇబ్రహీం ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మైనర్ బాలికల‌ పైన ఇలాంటి చర్యలను పునరావృతం కాకుండా చట్టపరమైన శిక్షను ఉపాధ్యాయునికి వేయాలని లేని పక్షంలో ఆందోళన చేస్తామని విద్యార్థిని తల్లిదండ్రులు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement