Sunday, November 24, 2024

TS: బీఆర్ఎస్ కు రాజీనామా… కమలం గూటికి అరిగెల సోదరులు…

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) : లోక్ సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ సీనియర్ నేతలు వరుస కట్టి వలస వెళ్తున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్ వేణుగోపాలచారి గులాబీ పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరగా, తాజాగా ఆసిఫాబాద్ జిల్లాలో తిరుగులేని నేతగా పేరున్న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, ఆయన సోదరుడు ఆసిఫాబాద్ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్, బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు మూకుమ్మడిగా ఆ పార్టీని వదిలి బీజేపీలో చేరారు.

బీజేపీ ఎంపీ అభ్యర్థి గొడెం నగేష్ కు సన్నిహితుడైన అరిగెల నాగేశ్వరరావుతో పార్టీ నేతల మంతనాలు ఫలించాయి. మూడుసార్లు ఎంపీపీగా, రెండుసార్లు జెడ్పీటీసీగా, తెలుగుదేశం, బీఆర్ఎస్ లో, క్రియాశీలక నాయకుడిగా ఒక పర్యాయం ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవులు నిర్వర్తించిన అరిగెల నాగేశ్వరరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ కే.లక్ష్మణ్ సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అశోక్ ముస్తాపురే తదితరులున్నారు.

మూడోసారి ప్రధానిగా మోడీ కావాలని.. పార్టీలో చేరా..
దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రపంచంలోనే విశేష ఆదరణ ఉందని, మోడీ నాయకత్వంలో పనిచేయాలన్న లక్ష్యంతో బీజేపీలో చేరినట్టు అరిగేలా నాగేశ్వరరావు ఆంధ్రప్రభ కు చెప్పారు. తన సన్నిహిత మిత్రుడు బీజేపీ అభ్యర్థి గొడం నగేష్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని గెలుపు కోసం పాటుపడతానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement